నరేంద్రమోడీ కేబినెట్‌లో ఆరుగురు మహిళలు

SMTV Desk 2019-05-31 12:26:07  modi, women mps,

ప్రధానమంత్రి నరేంద్రమోడీ సారథ్యంలో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వంలో గురువారం ప్రమాణస్వీకారం చేసిన వారిలో ఆరుగురు మహిళా మంత్రులున్నారు. 2019 ఎన్నికల్లో గతంలో ఎన్నడూ లేనంతగా ఎక్కువ సంఖ్యలో మహిళలు ఎంపీలుగా ఎన్నికయ్యారు. కానీ గత ప్రభుత్వంలో కంటే ఈసారి మహిళా మంత్రుల సంఖ్య తగ్గింది. మోడీ కేబినెట్ లో ఇదివరకు ఎనిమిది మంది మహిళలుండేవారు. ఈసారి అమేథీ విజేత సృతి ఇరానీ తోపాటు బిజెపి మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ (ఎస్‌ఎడి) అభ్యర్థిగా భటిండా నుంచి పోటీ చేసిన హర్ సిమ్రరత్ కౌర్ బాదల్ (52), నిర్మలా సీతారామన్ (59) కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీని ఆయన కంచుకోట అమేథీలోనే ఓడించి 43 ఏళ్ల స్మృతి ఇరానీ వీరనారిగా చరిత్రాత్మక విజయం సాధించారు. ఫతేపూర్ ఎంపి సాధ్వి నిరంజన్ జ్యోతి (52) సహాయ మంత్రిగా ప్రమాణం చేశారు. అలాగే ఛత్తీస్‌గఢ్ సర్గుజా నియోజక వర్గం నుంచి రేణుకా సింగ్ సరుతా (55), పశ్చిమ బెంగాల్‌లోని రాణీగంజ్ నుంచి గెలిచిన దేబశ్రీ చౌదరి (48) ప్రమాణస్వీకారం చేశారు.

వీరు మొదటిసారి లోక్‌సభలో అడుగుపెడుతున్నారు. వీరందరి శాఖలను త్వరలో ప్రకటిస్తారు. గత ప్రభుత్వంలో మహిళా మంత్రులుగా పనిచేసిన సుష్మా స్వరాజ్ (విదేశీ వ్యవహారాలు), ఉమాభారతి (మంచినీరు, శానిటేషన్), మేనకాగాంధీ (మహిళా, శిశు అభివృద్ధి), అనుప్రియా పటేల్ ( ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం)లకు ఈసారి మంత్రి పదవులు లభించలేదు. ఈసారి మహిళా ఎంపీల సగటు వయసు 51. స్మృతి ఇరానీ అందరికంటే చిన్నవారు కాగా, నిర్మలా సీతారామన్ మిగిలిన మహిళల కంటే వయసులో పెద్ద. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మొత్తం 724 మంది మహిళలు పోటీచేస్తే 78 మంది గెలిచారు. వారిలో ఉత్తరప్రదేశ్ నుంచి 11, పశ్చిమ బెంగాల్ నుంచి 11 మంది ఉన్నారు.