‘ఆర్‌ఆర్‌ఆర్’ సినిమా లేటెస్ట్ అప్ డేట్

SMTV Desk 2019-05-29 10:55:13  RRR,

అంచనాలకు అందని రేంజ్‌లో రూపొందుతున్న రాజమౌళి మల్టీ స్టారర్ ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్‌కు కొన్ని రోజులు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. రామ్‌చరణ్ గాయం దెబ్బకు ఏకంగా మూడు వారాలు వాయిదాపడిన ఈ మల్టీస్టారర్ తర్వాత ఎన్టీఆర్ చేతికి చిన్న దెబ్బ తగలడంతో ఇంకొన్ని రోజులు ఆగింది. ఇప్పుడు అన్నీ సమిసిపోయాయి. సోమవారం నుంచి ‘ఆర్‌ఆర్‌ఆర్’ షూటింగ్ హైదరాబాద్‌లో గతంలో వేసిన అల్యూమినియం ఫ్యాక్టరీ సెట్‌లో తిరిగి ప్రారంభమైంది. ఎన్టీఆర్ ఈ షూటింగ్‌లో పాల్గొంటున్నారు. అతని మీద ఒక యాక్షన్ ఎపిసోడ్ షూట్ చేస్తున్నారు. ఇది రెండు వారాల పాటు కొనసాగుతుంది. ట్విస్ట్ ఏంటంటే ఇందులో రామ్‌చరణ్ ఉండరు. కేవలం తారక్‌కు సంబంధించిన సన్నివేశాలు మాత్రమే తీస్తారు.

ఈ షెడ్యూల్ పూర్తయ్యాక అహ్మదాబాద్ వెళ్ళిపోయి అక్కడ అలియాభట్, రామ్ చరణ్‌లతో పాటు మిగిలిన తారాగణంతో అప్పుడు ఆగిపోయిన పార్ట్ షూటింగ్‌ను కొనసాగిస్తారు. మొత్తానికి నెలన్నర గ్యాప్ వచ్చిన ‘ఆర్‌ఆర్ ఆర్’ని రాజమౌళి బ్యాలెన్స్ చేసే పనిలో ఉన్నారు. ఇక వచ్చే ఏడాది జూలై 30ని రిలీజ్ డేట్‌గా ప్రకటించేశారు కాబట్టి ఇప్పుడు వచ్చే బ్రేక్స్ అన్నీ దాని మీద ప్రభావం చూపే అవకాశం ఉంది. అందుకే ఇదంతా రికవర్ చేయాలంటే కొంత అదనంగా కష్టపడాల్సి ఉంటుంది. ఇక ఎన్టీఆర్ సరసన నటించబోయే భామ గురించి సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరికొన్ని రోజుల్లో దీనికి సంబంధించిన ప్రకటన రావచ్చు. టాలీవుడ్ చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ‘ఆర్‌ఆర్‌ఆర్’కు సాయి మాధవ్ బుర్రా సంభాషణలు సమకూరుస్తుండగా కీరవాణి స్వరాలు అందిస్తున్నారు.