ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌ టోర్నీ: విజృంభిస్తున్న భారత షూటర్లు

SMTV Desk 2019-05-28 15:33:34  isfs, Rahi Sarnobat, issf shooter saurabh chaudhary

న్యూఢిల్లీ: ఐఎస్‌ఎస్‌ఎఫ్ షూటింగ్ ప్రపంచకప్‌ టోర్నీలో తొలి రోజు భారత షూటరు అపూర్వీ చండీలా పసిడి పతకంతో మెరువగా, సోమవారం జరిగిన వేర్వేరు పోటీల్లో రాహీ సర్నోబత్, సౌరభ్ చౌదరీ స్వర్ణ పతకాలతో సత్తాచాటారు. దీంతో మొత్తం మూడు స్వర్ణ పతకాలతో భారత్ టాప్‌లో దూసుకెళుతుండగా, ఒక స్వర్ణం సహా రజతం, రెండు కాంస్యాలతో చైనా రెండో స్థానంలో కొనసాగుతున్నది. మహిళల 25మీటర్ల పిస్టల్ విభాగంలో బరిలోకి దిగిన రాహీ సర్నోబత్ 37 పాయింట్లతో స్వర్ణ పతకాన్ని ఒడిసిపట్టుకుంది. ఒలెనా కోస్టెవిచ్(ఉక్రెయిన్, 36), అనోనెటా బోనెవ(బల్గేరియా, 26)కు వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కాయి. ఇదే విభాగంలో పోటీకి దిగిన మను భాకర్ 21 పాయింట్లతో ఐదో స్థానానికి పరిమితమైంది. స్వర్ణ పతకం ద్వారా వచ్చే ఏడాది జరిగే టోక్యో(2020) ఒలింపిక్స్‌కు రాహీ అర్హత సాధించింది. దీంతో ఇప్పటి వరకు అర్హత పొందిన భారత షూటర్ల సంఖ్య ఆరుకు పెరిగింది. మొత్తం 105 మంది పోటీపడ్డ రైఫిల్ ఈవెంటులో తొలుత సర్నోబత్ కంటే మను భాకర్ మెరుగ్గా రాణించినప్పటికీ ఏడో సిరీస్‌లో అనవసర తప్పిదంతో పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అర్హత రౌండ్‌లో రాహీ 586 పాయింట్లు దక్కగా, భాకర్ 585 పాయింట్లు కొల్లగొట్టింది. మరోవైపు పురుషుల 10మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంటులో సౌరభ్ చౌదరీ 246.3 పాయింట్ల ప్రపంచ రికార్డుతో పసిడి పతకాన్ని ఒడిసిపట్టుకున్నాడు. అర్టెమ్ చెర్నోసోవ్(రష్యా, 243.8), వీ పాంగ్(చైనా, 220.7) వరుసగా రజత, కాంస్య పతకాలు దక్కించుకున్నారు. ఇంతకు ముందు సీనియర్, జూనియర్ విభాగాల్లో తన పేరిట ఉన్న ప్రపంచ రికార్డులను సౌరభ్ చౌదరీ తాజాగా తిరుగరాశాడు.