ఫ్రెంచ్ ఓపెన్‌: శుభారంభం చేసిన నాదల్, జకోవిచ్

SMTV Desk 2019-05-28 15:26:31  Novak Djokovic, rafael nadal, french open tennis tournament

పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ రఫెల్ నాదల్ (స్పెయిన్), టాప్ సీడ్ నొవాక్ జకోవిచ్ (సెర్బియా) తొలి రౌండ్‌లో విజయం సాధించారు. పబ్లొ బుస్టా (స్పెయిన్), 26వ సీడ్ గిలెస్ సిమెన్ (ఫ్రాన్స్) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించారు. మహిళల సింగిల్స్‌లో అసస్తాసిజా సెవస్తొవా (లాత్వియా), డొనా వెకిక్ (క్రొయేషియా) తదితరులు ముందంజ వేశారు. పురుషుల సింగిల్స్‌లో ప్రస్తుత ఛాంపియన్ నాదల్ తొలి రౌండ్‌లో అలవోక విజయాన్ని అందుకున్నాడు. ఏకపక్షంగా సాగిన పోరులో నాదల్ 62, 61, 63 తేడాతో జర్మనీ ఆటగాడు యనిక్ హాన్ఫ్‌మాన్‌ను ఓడించాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన నాదల్ ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు.తన మార్క్ షాట్లతో అలరించిన నాదల్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు. మరో పోటీలో టాప్ సీడ్ జకోవిచ్ కూడా సునాయాస విజయంతో రెండో రౌండ్‌కు దూసుకెళ్లాడు. సోమవారం జరిగిన తొలి రౌండ్‌లో జకోవిచ్ 64, 62, 62 తేడాతో పోలండ్ క్రీడాకారుడు హాబర్ట్ హుర్కాజ్‌ను చిత్తు చేశాడు. తొలి సెట్‌లో ప్రత్యర్థి నుంచి కాస్త స్రతిఘటన ఎదుర్కొన్న జకోవిచ్ తర్వాత వెనుదిరిగి చూడలేదు. తన మార్క్ షాట్లతో ప్రత్యర్థిని హడలెత్తిస్తూ లక్షం దిశగా అడుగులు వేశాడు. చివరికి వరుసగా మూడు సెట్లను గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో స్పెయిన్ స్టార్ బుస్టా 63, 61, 63తో పోర్చుగల్‌కు చెందిన సౌసాను చిత్తు చేశాడు. ప్రారంభం నుంచే చెలరేగి ఆడిన బుస్టా ఏదశలోనూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. సునాయాసంగా మూడు సెట్లు గెలిచి రెండోరౌండ్‌కు దూసుకెళ్లాడు. మరోవైపు మహిళల సింగిల్స్‌లో సెవస్తొవా 61, 64తో థాయిలాండ్ క్రీడాకారిణి లుషికా కుమ్‌కుమ్‌ను ఓడించింది. మరో పోటీలో డొనా వెకిక్ 62, 64తో సమ్‌సొనానా (రష్యా)ను చిత్తు చేసింది. అమెరికా క్రీడాకారిణి రోజర్స్ 63, 63తో ఆస్ట్రేలియా క్రీడాకారిణి అస్త్రా శర్మను ఓడించి రెండో రౌండ్‌లో ప్రవేశించింది.