ధోని వల్ల కోహ్లీకి చాలా లాభం: మంజ్రేకర్

SMTV Desk 2019-05-27 15:54:05  virat kohli, mahendra singh dhoni, icc wrold cup 2019, commentor sanjay manjrekar

భారత మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని గురించి కామెంటేటర్ సంజయ్ మంజ్రేకర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. త్వరలో జరగబోయే వరల్డ్ కప్ లో ధోనీ ఉండడం కెప్టెన్ విరాట్ కోహ్లీకి చాలా కలిసొస్తుంది అని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా మంజ్రేకర్ మాట్లాడుతూ...క్రికెట్‌లోకి తొలుత విధ్వంసకర హిట్టర్‌గా వచ్చిన ధోనీ.. ఆ తర్వాత అత్యుత్తమ వికెట్‌ కీపర్‌గా, విజయవంతమైన కెప్టెన్‌గా ఎదిగాడని, ఆ అనుభవం ప్రపంచకప్‌లో కెప్టెన్ కోహ్లీకి ఉపయోగపడుతుందని వెల్లడించాడు. ఇటీవల ముగిసిన ఐపీఎల్ 2019 సీజన్‌లో 15 మ్యాచ్‌లాడిన ధోని.. 416 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కీపర్‌గానూ మెరుపు స్టంపింగ్స్‌తో అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఇక కెప్టెన్‌గా.. చెన్నై సూపర్ కింగ్స్ జట్టుని ఫైనల్‌కి చేర్చి.. తన కూల్ కెప్టెన్సీ పవర్‌ని మరోసారి అభిమానులకి గుర్తు చేశాడు. అలాగే ‘ధోనీ తొలుత హిట్టర్‌గా భారత్ జట్టులోకి వచ్చాడు. ఆ తర్వాత అత్యుత్తమ వికెట్ కీపర్‌గా, మంచి కెప్టెన్‌గా పేరు తెచ్చుకున్నాడు. అంటే.. ఇప్పుడు అతనిలో ముగ్గురు ఉన్నారన్నమాట. ఇటీవల ముగిసిన ఐపీఎల్‌లో ధోనీ మూడు పాత్రలో చక్కగా రాణించాడు. ఇక భారత మణికట్టు స్పిన్నర్లు చాహల్, కుల్దీప్ యాదవ్ బౌలింగ్‌లో ధోనీ తప్ప ఎవరూ మెరుగ్గా కీపింగ్ చేయలేరేమో..? వారికి సలహాలిస్తూ.. ప్రత్యర్థి వికెట్లను ధోనీ పడగొట్టగలడు. చివరిగా ఒత్తిడిని జయించే టెక్నిక్. ప్రపంచకప్‌లో ధోనీ నుంచి కోహ్లీ సలహాలు తీసుకుంటూ.. నేర్చుకోవాలి’ అని మంజ్రేకర్ సూచించాడు.