శనివారం కేంద్ర మంత్రి వర్గంలో మార్పులు

SMTV Desk 2017-08-24 18:32:42  Central Government, Cabinet Ministers, Modi, Amit Shah

న్యూఢిల్లీ, ఆగస్ట్ 24: ఇటీవల వెంకయ్యనాయుడు ఉప రాష్ట్రపతి పదవి చేపట్టిన తరువాత ఆయన అప్పటి వరకు బాధ్యతలు నిర్వర్తించిన పట్టణాభివృద్ధి శాఖ ప్రస్తుతం ఖాళీగా ఉంది. తాజాగా రైలు ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఆ శాఖ మంత్రి సురేష్ ప్రభు రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలో కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌పై చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో ఢిల్లీలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర‌ మోదీ, భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా సమావేశమయ్యారు. మోదీ కేబినెట్‌లో సీనియ‌ర్ శాఖ‌ల్లోనూ మార్పులు చేసే యోచనలో ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా ఏడుగురు కేంద్ర మంత్రులపై వేటు ప‌డే అవ‌కాశం ఉన్నట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. కాగా, ఇటీవల భాగస్వామ్యం కుదిరిన జేడీయూ, అన్నాడీఎంకేలకు కేంద్ర మంత్రి వర్గంలో స్థానం కల్పించే అవకాశాలు ఉన్నట్లు విశ్లేషకులు తెలుపుతున్నారు. ఈ నేపధ్యంలో కేంద్ర మంత్రి వ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌ శనివారం జరగనున్నట్లు తెలుస్తోంది.