ఓ సీఎంపై దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్షం గానీ స్పందించకపోవడం ఏంటి?

SMTV Desk 2019-05-08 11:35:03  delhi cm, aap, aam admi party, rahul gandhi, bjp

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పై ఎన్నికల ప్రచారంలో జరిగిన దాడి కాంగ్రెస్ కుట్రేనని ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ సంజయ్ కుమార్ ఆరోపించారు. ఈ దాడిలో రాహుల్ హస్తంతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ ప్రమేయం కూడా వున్నట్లుగా అనుమానిస్తున్నామని అన్నారు. లేకుంటే ఓ సీఎంపై దాడి జరిగితే కేంద్ర ప్రభుత్వం కానీ, ప్రతిపక్ష కాంగ్రెస్ గానీ స్పందించకపోవడం ఏంటని ప్రశ్నించారు. ఈ కుట్రను తేటతెల్లం చేసిందన్నారు. ఈ రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో ఆప్ ను ఎదుర్కోలేక ఇలాంటి దుర్మార్గాలకు పాల్పడుతోందంటూ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇప్పటివరకు తమ ముఖ్యమంత్రిపై తొమ్మిది సార్లు భౌతిక దాడులు జరిగినట్లు ఆయన గుర్తుచేశారు. ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రిపై సాధారణ వ్యక్తులు దాడులకు తెగబడే సాహసం చేయరన్నారు. కేవలం కుట్రల్లో భాగంగానే కేజ్రీవాల్ పై ఈ దాడులు జరుగుతున్నట్లు తెలిపారు. ఆయన ప్రాణాలకు హాని తలపెట్టే ఈ కుట్రలపై ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సంజయ్ వెల్లడించారు.

ఈ దాడి జరిగి మూడు రోజులు కావస్తున్నా జాతీయ పార్టీలైన బిజెపి, కాంగ్రెస్ లు దీన్ని ఖండించకపోవడం దారుణమన్నారు. దేశవ్యాప్తంగా వున్న రాజకీయ పక్షాలు, పార్టీలు ఖండించినా రాహుల్ స్పందించక పోవడంపై ఏంటని ప్రశ్నించారు. ఈ దాడిలో హస్తం వుంది కాబట్టే ఆయన స్పందించడానికి వెనుకాడుతున్నట్లు సంజయ్ అనుమానం వ్యక్తం చేశాడు.