తీవ్ర స్థాయిలో క్షీణిస్తున్న చమురు

SMTV Desk 2019-05-06 12:47:35  crued oil

రెండు వారాల క్రితం ఆసియా దేశాలు కొనే బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 75 డాలర్లకు చేరుకోగా పోయిన వారం భారీ మార్పులతో 71 డాలర్లకుక్షీణించింది. అయితే ఈ రోజు మరింత నష్టపోయి రెండు శాతంపైగా క్షీణించింది. అమెరికా క్రూడ్ మరింత ఎక్కువగా క్షీణించింది. ట్రంప్ చర్యల వల్ల చైనాలో పారిశ్రామిక ఉత్పత్తి దెబ్బతింటుందని, ప్రపంచ వ్యాప్తంగా ఆయిల్‌కు డిమాండ్ తగ్గుతుందన్న వార్తలతో క్రూడ్ ఆయిల్‌లో అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. అమెరికాలో సరఫరాకు మించి ఉత్పత్తి జరుగుతుండటం, ఇరాన్‌పై ఆంక్షల ప్రభావం పెద్దగా లేకపోవడంతో ముడి చమురు ధరలపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. త్వరలోనే ఒపెక్ దేశాల భేటీ నేపథ్యంలో ట్రంప్ ట్వీట్ ఆయిల్ మార్కెట్‌ను చావు దెబ్బతీసింది. మరోవైపు ఇతర మెటల్స్ కూడా భారీగా క్షీణించాయి. నికెల్‌, కాపర్ వంటి మెటల్స్ కూడా ఒక శాతంపైగా నష్టంతో ట్రేడవుతున్నాయి.స్టాక్ మార్కెట్లు కుప్పకూలుతున్న సమయంలో అమాంతంగా పెరిగే బంగారం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఫారెక్స్ మార్కెట్‌లో డాలర్ నిలకడగా ఉండటమే దీనికి కారణం. డాలర్‌తో ఏమాత్రం మార్పు వచ్చినా... షేర్ మార్కెట్‌లో ఇంకా పతనం కొనసాగే పక్షంలో... బులియన్ మార్కెట్‌పై ఒత్తిడి పెరగొచ్చు. బంగారం ఔన్స్ ధర ఇపుడు 1283 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. ఇది దాదాపు శుక్రవారం నాటి ధర. కాని వెండిలో మాత్రం ఇతర మెటల్స్ మాదిరే అమ్మకాల ఒత్తిడి వస్తోంది. ఔన్స్ వెండి ధర 0.6 శాతం తగ్గి 14.89 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.