దీన్ని బట్టి వారికి నా పై ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చు: ప్రధాని మోదీ

SMTV Desk 2019-05-03 10:14:10  pm modi, narendra modi, congress, jakir naik

భోపాల్, మే 02: కాంగ్రెస్ నేతలు తనను చంపేయాలన్నంత కసితో రగిలిపోతున్నారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఇటార్సీలో జరిగిన ఎన్నికల సభలో ప్రసంగించిన మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇటీవల కాంగ్రెస్‌కు చెందిన ఓ నేత మాట్లాడుతూ.. మోదీని తంతే సరిహద్దులకు అవతల పడి చావాలని అన్నాడని, దీనిని బట్టి వారికి తనపై ఎంత కోపం ఉందో అర్థం చేసుకోవచ్చని ప్రధాని అన్నారు. కాంగ్రెస్ నేతలు తనపై వ్యక్తిగతంగా ద్వేషాన్ని పెంచుకున్నారని అన్నారు.

వివాదాస్పద మతబోధకుడు జకీర్ నాయక్‌ను మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దిగ్విజయ్ సింగ్ భుజాలకెత్తుకున్నారని ఆరోపించారు. పేలుళ్ల తర్వాత శ్రీలంక జకీర్ నాయక్ టీవీని నిషేధించిందని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వాలు మాత్రం ఆయనను శాంతిదూతగా అభివర్ణిస్తున్నాయని ఎద్దేవా చేశారు. ప్రధానమంత్రి కావాలనుకుంటున్న నేతలు విపక్ష నేతలు కూడా కాలేరన్నారు. 55 ఏళ్ల వంశపాలన బాగుందో, 55 నెలల చాయ్‌వాలా పాలన బాగుందో చెప్పాలని ప్రజలను కోరారు.