కోహ్లీ విశ్రాంతి తీసుకుంటే మంచిది!

SMTV Desk 2019-05-02 12:44:41  virat kohli, ipl 2019, rcb

బెంగళూరు: ఐపీఎల్ 2019 సీజన్లో ప్లేఆఫ్ కు ఎంపిక కాని తొలి జట్టు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ టీంను ప్లేఆఫ్ నుంచి తొలగించిన నేపథ్యంలో దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కుమారుడు, మాజీ క్రికెటర్ రోహన్ గవాస్కర్ విరాట్ కోహ్లీపై పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఐపీఎల్‌లో మ్యాచ్ కామెంటేటర్‌గా పనిచేస్తున్న రోహన్ గవాస్కర్ తాజాగా మాట్లాడుతూ ‘ఇంగ్లాండ్ వేదికగా మే 30 నుంచి వన్డే ప్రపంచకప్ మొదలుకానున్న నేపథ్యంలో.. టీమిండియా వైపు నుంచి ఆలోచించి.. విరాట్ కోహ్లి ఇక ఐపీఎల్ నుంచి విశ్రాంతి తీసుకుంటే మంచిది. కానీ.. కోహ్లీ అలా రెస్ట్ తీసుకునే క్రికెటర్‌ కాదు. ఎల్లప్పుడూ క్రికెట్ ఆడాలని పరితపిస్తుంటాడు. కాబట్టి.. తనకి తానుగా కోహ్లీ ఎప్పుడూ విశ్రాంతి కోరడు. అయితే.. చివరి మ్యాచ్‌లో బెంగళూరు టీమ్‌‌ తన రిజర్వ్ బెంచ్‌ని పరీక్షించుకునే అవకాశం ఉంది. చాలా మంది యువ ఆటగాళ్లు టీమ్‌లో ఉన్నారు. హైదరాబాద్‌పై మ్యాచ్‌లో వారికి అవకాశం ఇవ్వడం ద్వారా.. బెంచ్‌ సామర్థ్యంపై ఆర్సీబీ యాజమాన్యం ఓ అవగాహన‌కి రావొచ్చు’ అని రోహన్ గవాస్కర్ సూచించాడు. బెంగళూరు టీమ్ ప్లేఆఫ్‌కి చేరకపోవడంతో.. ఈనెల 5 నుంచి కోహ్లికి విశ్రాంతి దొరకనుంది.