భారత్‌కు రానున్న 200 అమెరికన్ కంపెనీలు!!

SMTV Desk 2019-04-29 20:19:53  india, china central, 200 american compenys transfer to india, US-India Forum Claims 200 US Companies Seeking To Move Manufacturing To India From China, USISPF, Make In India

న్యూఢిల్లీ: త్వరలో భారత్‌కు చైనా కేంద్రంగా పని చేస్తున్న దాదాపు 200 అమెరికన్ ఉత్పాదక కంపెనీలు తరలివచ్చే సూచనలు కనిపిస్తున్నాయని ‘యుఎస్ ఇండియా స్ట్రాటజిక్ అండ్ పార్టర్‌షిప్ ఫోరం’అధ్యక్షుడు ముకేష్ అఘి అన్నారు. ఈ మేరకు వారితో సంప్రదింపులు కూడా జరిపినట్లు తెలిపారు. ఈ క్రమంలో కేంద్రంలో రానున్న కొత్త ప్రభుత్వం సంస్కరణలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.అలాగే నిర్ణయాత్మక ప్రక్రియలో మరింత పారదర్శకత అవసరమన్నారు. ‘గత 1218 నెలల్లో అమెరికన్ కంపెనీలు తీసుకున్న నిర్ణయాలను గమనిస్తున్నాం. డేటా లోకలైజేషన్, ఈ కామర్స్ వంటి అంశాల్లో స్థానికతకు పెద్ద పీట వేసే యోచనలో పారిశ్రామికవేత్తలున్నారు. మనం వారిని ఎలా ఆకట్టుకోవాలనే దానిపై దృష్టి పెట్టాలి.అందుకు అనుగుణంగా భూ సేకరణ మొదులకొని పన్నుల విధానం వరకు అనేక అంశాల్లో సంస్కరణలను వేగవంతం చేయాలి. దీని ద్వారా భారీగా ఉద్యోగావకాశాలు సృష్టించే అవకాశముంది’ అని ముకేష్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు భారత్ తన ఎగుమతులను పెంచుకునే అవకాశాలపై అమెరికాకు చెందిన ఓ ఉన్నతాధికారి యుఎస్ ఐఎస్‌పిఎఫ్‌కు పలు సిఫార్సులు చేసినట్లు ముకేష్ తెలిపారు.అందులో భాగంగా సూచించిన ఇరు దేశాల మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పదం (ఎఫ్‌టిఓ) ప్రతిపాదన భారత్‌కు ఎంతో మేలు చేస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీని ద్వారా అమెరికాతో వాణిజ్య సంబంధాలు మెరుగుపడడంతో పాటుగా ప్రధాన వాణిజ్య హోదా (జిఎస్‌పి) చైనా చౌక సరకులపై భారత్ ఆందోళన లాంటి సమస్యలకూ పరిష్కారం లభించే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిపై ఇప్పటికే ఒక ఉన్నతస్థాయి మండలిని ఏర్పాటు చేశామని.. భారత్‌ను ఉత్పాదక పరిశ్రమల కేంద్రంగా మార్చడానికి తీసుకోవలసిన చర్యలపై కసరత్తు ప్రారంభించామని ముకేష్ చెప్పారు. భారత్‌లో సార్వత్రిక ఎన్నికలు ముగిసే నాటికి అందుకు సంబంధించిన ప్రతిపాదనలను సిద్ధం చేస్తామన్నారు. భారత్‌లో కంపెనీలు నెలకొల్పడం ద్వారా దేశీయ మార్కెట్లతో పాటుగా అంతర్జాతీయ విపణిలోను రాణించాలనే యోచనలో అమెరికా కంపెనీలు ఉన్నట్లు తెలుస్తోందన్నారు. దీనిద్వారా దేశంలోకి భారీ ఎత్తున పెట్టుబడులు వచ్చే అవకాశముందని ఆయన అభిప్రాయపడ్డారు.