వారణాసిలో నామినేషన్ వేసిన ప్రధాని మోడీ

SMTV Desk 2019-04-26 16:13:30  Varanasi, Modi,

ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం ఉదయం వారణాసిలో కలెక్టర్ కార్యాలయానికి భారీ ఊరేగింపుగా తరలివచ్చి నామినేషన్ వేశారు. అంతకు ముందు స్థానిక కాలభైరవస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేలాదిమంది ప్రజలు, బిజెపి కార్యాకర్తలు వెంటరాగా ప్రధాని నరేంద్రమోడీ భారీ ఊరేగింపుగా కలెక్టర్ కార్యాలయానికి చేరుకొన్నారు. దారి పొడవునా ప్రజలు నరేంద్రమోడీపై పూలవర్షం కురిపిస్తూ స్వాగతం పలికారు.

మోడీ రాక సందర్భంగా రెండు రోజులు ముందు నుంచే వారణాసిలో భారీగా పోలీసులు, భద్రతాదళాలు, నిఘా బృందాలు మోహరించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసి అడుగడుగునా నిఘా పెట్టాయి. మోడీ ఊరేగింపు కారణంగా ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచే వారణాసిలో రోడ్లన్నీ బిజెపి కార్యకర్తలతో...వారి వాహనాలతో కిక్కిరిసిపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఊరేగింపులో నరేంద్రమోడీ వెంట యూపీ సిఎం యోగీ ఆదిత్యనాధ్ ఉన్నారు.

మోడీ నామినేషన్ కార్యక్రమానికి దేశ నలుమూలల నుంచి ఎన్డీయే భాగస్వామ్య పార్టీల నేతలు తరలిరావడం మరో విశేషం. తమిళనాడు నుంచి పన్నీరు సెల్వమ్ (అన్నాడిఎంకె), పంజాబ్ నుంచి ప్రకాష్ సింగ్ బాదల్ (అకాలీదళ్), బీహార్ నుంచి నితీశ్ కుమార్ (జెడియూ), మహారాష్ట్ర నుంచి ఉద్దవ్ థాక్రే (శివసేన), అమిత్ షా (బిజెపి), రామ్‌విలాస్‌ పాశ్వాన్‌ (ఎల్‌జేపీ) ఇంకా పలువురు కేంద్రమంత్రులు మోడీ నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు.