ప్రధాని అయ్యాక ఆమె గురించి తెలిసింది: మోదీ

SMTV Desk 2019-04-21 15:31:47  indian pm, pm modi, mamata benarjee, trunamool party, loksabha elections

బెంగాల్: ఎన్నికల సందర్భంగా దక్షిణ దినాజ్‌పూర్ జిల్లాలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ప్రధాని మోదీ తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి మమతాబెనర్జీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ....లోక్‌సభకోసం పశ్చిమబెంగాల్‌లో రెండు విడతల పోలింగ్ తర్వాత స్పీడ్ బ్రేకర్ దీదీకి నిద్రపట్టడంలేదని ఆయన అన్నారు. ‘మా, మాతి, మనుష్ (మాతృమూర్తి, మాతృభూమి, మనుషులు) అనే తృణమూల్ నినాదంతో ముఖ్యమంత్రి ప్రజల్ని మభ్యపెడుతున్నారు’ అని విమర్శించారు. ‘రాష్ట్రంలో రెండు విడతల పోలింగ్ గురించి నివేదికలు అందిన తర్వాత మమతా బెనర్జీ నిద్రకు దూరమయ్యారు. మొదట ఆమెను అంచనా వేయడంలో పొరబడ్డాను. అప్పట్లో ఆమెను టీవీలో చూసేవాడిని. తర్వాత అప్పుడప్పుడూ కలిసేవాడిని. నిరాడంబరత,కష్టపడి పనిచేయడం, బెంగాల్ అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేయడం వంటి విషయాల్లో మమత ఒక ఉదాహరణ అనుకున్నాను. కానీ నేను ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె కార్యకలాపాలు తెలిశాయి. నా కళ్లు తెరుచుకున్నాయి. టిఎంసి అధినేత్రి అసలు రంగు తెలిసింది. బెంగాల్ సిఎం ఎలాంటి వ్యక్తో పిల్లలకు కూడా తెలుసు’ అని ప్రధాని వ్యాఖ్యానించారు. విధ్వంసం, ప్రజల సొమ్మును దోచుకోవడం, అభివృద్ధిని అడ్డుకోవడం చేస్తే ఫలితం ఎలా ఉంటుందో దీదీకి మే 23న తెలుస్తుందని మోడీ చెప్పారు. తృణమూల్ కాంగ్రెస్ ఎన్నికల ప్రచారానికి పొరుగుదేశం వారికి అవకాశం ఇవ్వడాన్ని ఆయన తప్పు పట్టారు. ఇది చాలా సిగ్గుచేటని, మైనారిటీ వర్గాల్ని సంతృప్తి పరిచేందుకే బెంగాల్ సిఎం ఇలా చేస్తున్నారని విమర్శించారు. బంగ్లాదేశ్ నటుడు ఫిరదౌస్ టిఎంసి ప్రచారానికి రావడం గురించి చెబుతూ… భారతదేశంలో ఇదివరకెన్నడూ ఇలా జరగలేదన్నారు. పాకిస్థాన్‌లోని బాలాకోట్‌పై మనం జరిపిన దాడులకు సాక్ష్యాలడుగుతున్న మమతాబెనర్జీ … చిట్‌ఫండ్ కుంభకోణం సూత్రధారుల ఆధారాలను సేకరించాలని మోడీ సవాల్ విసిరారు.