హార్దిక్ పటేల్ గుజరాత్‌కు ఏమైనా హిట్లరా?

SMTV Desk 2019-04-20 12:59:20  Hardik Patel,

పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా గుజరాత్ లోని సురేంద్ర నగర్‌లో స్టేజీ మీద కాంగ్రెస్ నేత హార్దిక్ పటేల్ మాట్లాడుతుండగా ఓ తరుణ్ గుజ్జర్ అనే వ్యక్తి హార్దిక్ చెంప చెల్లుమనిపించాడు. అనంతరం హార్దిక్ పటేల్ అనుచరులు తరుణ్‌ను తీవ్రంగా కొట్టారు. గాయపడిన తరుణ్‌ను పోలీసులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి నుంచి తరుణ్ మీడియాతో మాట్లాడారు. పటీదార్ ఉద్యమంతో హార్దిక్ గుజరాత్ లో అల్లర్లు సృష్టించారని మండిపడ్డారు. గతంలో హార్దిక్ అహ్మదాబాద్‌లో ర్యాలీ నిర్వహిస్తున్నప్పుడు తన భార్య గర్భణీగా ఉందని, అప్పుడు చాలా ఇబ్బందులు పడ్డామని, తన కుమారుడి ఆరోగ్యం బాగోలేకపోతే మందులు తీసుకరావడానికి మందుల షాప్ కు వెళ్లానని, ఎక్కడి మెడికల్ షాపులు ఓపెన్ చేయలేదన్నారు. అప్పుడు తాను తీవ్ర మనోవేధనకు గురయ్యానని వెల్లడించారు. అందుకే హార్దిక్ కొట్టి తన బాధను తెలియజేశానని వివరించారు. హార్దిక్ పటేల్ గుజరాత్‌కు ఏమైనా హిట్లరా? అని ప్రశ్నించారు. ఎప్పుడు చూసినా హార్దిక్ ధర్నాలు, ర్యాలీలు చేపట్టేవాడని, దీంతో స్థానికులు తీవ్రంగా ఇబ్బందులు పడేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆగస్టు25న-2015లో అహ్మదాబాద్‌లో పటీదార్ ఉద్యమం ఉవ్వెత్తున్న చెలరేగినప్పుడు 14 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. గురువారం ఢిల్లీలో బిజెపి కేంద్రం కార్యాలయంలో రాజ్యసభ సభ్యుడు జివిఎల్ నరసింహారావు మాట్లాడుతుండగా శక్తి భార్గవ్ అనే వ్యక్తి ఆయనపై బూటు విసిరేసిన విషయం విదితమే.