కాంగ్రెస్‌కు ఈసీ వార్నింగ్...!

SMTV Desk 2019-04-09 11:27:50  congress party, central election commission of india, congress party election song, nyaay scheme song

న్యూఢిల్లీ: జాతీయ కాంగ్రెస్ పార్టీకి ఈసీ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ ప్రచార గీతంలో అభ్యంతరకరంగా ఉన్న కొన్ని లైన్లను తొలగించాలని కాంగ్రెస్‌కు ఈసీ హెచ్చరించింది. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ న్యాయ్‌ పథకాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ ప్రచార గీతాన్ని తీర్చిదిద్దింది. కాంగ్రెస్‌ ప్రచార గీతంలో ఎన్ డిఎ పాలనలో విద్వేషాలు పెచ్చరిల్లాయని, కొన్ని వర్గాల మధ్య ఘర్షణలు చెలరేగి మూకదాడులకు దారితీశాయనే విధంగా కొన్ని లైన్లు ఉన్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు వచ్చాయి. దీంతో గీతంలోని అభ్యంతరకర లైన్లను తొలగించాలని ఎన్నికల సంఘం కాంగ్రెస్ ను ఆదేశించింది. ఎన్నికల సంఘం ఆదేశాలకు అనుగుణంగా మార్పులు చేసి ఆ ప్రచార గీతాన్ని విడుదల చేస్తామని కాంగ్రెస్‌ వర్గాలు తెలిపాయి. ఈ ప్రచార గీతంలో దేశంలో పెరిగిపోయిన నిరుద్యోగం, నోట్ల రద్దు వల్ల వచ్చిన ఇబ్బందులు, మహిళల భద్రత, జిఎస్‌టి, రైతుల ఆత్మహత్యలు వంటి అనేక అంశాల్ని పొందుపరిచారు. ఏప్రిల్‌ 11 నుంచి మే 19 వరకూ ఏడు దశల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. మే 23న ఓట్ల లెక్కింపు జరగనుందని ఎన్నికల అధికారులు తెలిపారు.