భారత్‌లో అత్యంతగా ఇష్టపడే కార్యాలయంగా ఫ్లిప్‌కార్ట్

SMTV Desk 2019-04-04 16:53:34  buisiness, flipkart

న్యూఢిల్లీ: భారత్‌లో అత్యంతగా ఇష్టపడే కార్యాలయంగా వాల్‌మార్ట్‌కు చెందిన ఫ్లిప్‌కార్ట్ మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాత రెండు మూడు స్థానాల్లో మరో ఇకామర్స్ సంస్థ అమెజాన్, ఆతిథ్య సంస్థ ఓయో ఉన్నాయి. ఈమేరకు వృత్తి నిపుణుల సోషల్ మీడియా నెట్‌వర్క్ ‘లింక్డ్‌ఇన్’ ఈ సర్వే నివేదికను విడుదల చేసింది. లింక్డ్‌ఇన్ నాలుగో ఎడిషన్ ఇండియా ‘2019 టాప్ కంపెనీస్’ జాబితాలో 10 స్థానాల్లో ఇంటర్నెట్ కంపెనీలే ఎక్కువగా ఉండడం గమనార్హం. ఐటి దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టిసిఎస్) ఏడో ర్యాంక్‌ను సాధించగా, ఇంటర్నెట్, కన్జూమర్ సేవల కంపెనీలు స్విగ్గీ, జొమాటో సంస్థలు ఆరు, ఎనిమిది స్థానాలను దక్కించుకున్నాయి. ఉబెర్ ఐదు, వన్97 కమ్యూనికేషన్ నాలుగు, రిలయన్స్ ఇండస్ట్రీస్ పదో స్థానం పొందాయి. ఇంకా ఈ జాబితాలో కన్సల్టింగ్ సంస్థ బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ (బిసిజి) 13 వ స్థానం, యస్ బ్యాంక్ (14), ఐబిఎం (15), డైమ్లెర్ ఎజి (16), ఫ్రెష్‌వర్క్ (17), యాక్సెంచర్ (18), ఓలా (19), ఐసిఐసిఐ బ్యాంక్ (20), పిడబ్లుసి ఇండియా (21), కెపిఎండి ఇండియా (22), లార్సెన్ & టుబ్రో (23), ఒరాకిల్ (24), క్వాల్కమ్ 25 స్థానంలో ఉన్నాయి.