దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు

SMTV Desk 2019-03-31 18:13:30  Modi, Ponguleti,

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ షాక్ ఇచ్చారు సీనియర్ నేత, ఏఐసీసీ సభ్యుడు పొంగులేటి సుధాకర్ రెడ్డి. దేశ ప్రజలు మోడీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని. అందుకే తాను బీజేపీలో చేరుతున్నానని ప్రకటించారు పొంగులేటి. ఈరోజు ఢిల్లీలో ప్రధానమంత్రి మోడీతో దాదాపు 25 నిమిషాల పాటు భేటీ అయ్యారు పొంగులేటి. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న తప్పిదాలను.. లోపాలను రాహుల్ గాంధీ సరిదిద్ద లేకపోవడం దురదృష్టకరమని ఆయన తెలిపారు.

అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో నాకు అవమానాలు జరిగాయి. నేను చేసిన పనికి 20 శాతం ఫలితమే కాంగ్రెస్ లో దక్కింది. కాంగ్రెస్ పార్టీ ఓ వ్యాపార పార్టీగా మారింది. దేశ భద్రత విషయంలో కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేస్తోంది. బాలాకోట్ లో ఉగ్రవాద శిబిరాలపై సైనికులు దాడులు చేస్తే సాక్ష్యాలున్నాయా అని అడగడం సిగ్గుచేటు. దళారులు కాంగ్రెస్ లో కీలక పాత్ర పోషిస్తున్నారు. నాలాంటి విధేయులకు కాంగ్రెస్ పార్టీలో స్థానం దొరకడం లేదు. ఎన్నికల్లో పోటీకి డబ్బు ఉందా? అని అడుగుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన మళ్లీ అదే నాయకత్వానికి లోక్ సభ ఎన్నికల బాధ్యతలు అప్పగించారు. ఈవీఎంలు ట్యాంపరింగ్ వల్లే టీఆర్ఎస్ గెలిచిందని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. రాష్ట్ర నాయకత్వం ఘోరంగా విఫలమైంది. కాంగ్రెస్ పార్టీపై నమ్మకం లేక ఎమ్మెల్యేలందరూ టిఆర్ఎస్ లో చేరుతున్నారు. అంటూ పొంగులేటి కాంగ్రెస్ పై నిప్పులు చెరిగారు.

అంతేకాకుండా బలమైన నాయకత్వంతో కలిసి పని చేయాలనే ఉద్దేశంతోనే తాను బీజేపీలో చేరుతున్నానని.. 1993 నుంచి నరేంద్ర మోడీతో తనకు పరిచయం ఉందని వివరించారు. తెలంగాణలో బీజేపీ బలోపేతం కోసం పని చేస్తామని పొంగులేటి సుధాకర్ రెడ్డి స్పష్టం చేశారు