300కు పైగా సీట్లు సాధిస్తాం

SMTV Desk 2019-03-30 12:09:10  Modi, elections,

న్యూఢిల్లీ:లోక్‌సభ ఎన్నికల్లో విజయంపై ప్రధాని నరేంద్ర మోడీ పూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు. ఎన్‌డిఏ 300కు పైగా స్థానాలను గెలుచుకొని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని అన్నారు. ‘ రిపబ్లిక్ భారత్’ న్యూస్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో మోడీ మాట్లాడుతూ గతంలో మోడీ ఎవరనే కొన్ని సందేహాలు ప్రజల్లో ఉండేవని, అయితే ఇప్పుడు దేశ భద్రత, ప్రజల సమస్యల పరిష్కారం సహా పలు అంశాల విషయంలో మోడీ ఏం చేశారో ప్రజలకు తెలుసునని, అందుకే వారు ప్రత్యామ్నాయం కోసం వెతకడం లేదని అన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు 2014కన్నా మెరుగైన తీర్పును ఇవ్వబోతున్నారని, బిజెపి పూర్తి మెజారిటీతో విజయం సాధిస్తుందని చెప్పారు. కాగా, ఉపగ్రహ విధ్వసక క్షిపణి ప్రయోగం ఎప్పుడు జరపాలనేది ఈ ప్రయోగం జరపడానికి అంతరిక్షంలో ఖాళీ ప్రదేశం అందుబాటులో ఉండడాన్ని బట్టి ఉంటుందని ఒక ప్రశ్నకు సమాధానంగా ప్రధాని చెప్పారు. కాగా, 2014కన్నా ఇప్పుడుప్రతిపక్షాల ఐక్యతా సూచీ ఎక్కువగా ఉందన్న వాదనలను ఆయన తోసిపుచ్చారు. వాస్తవంగా చేసినట్లయితే అప్పటికన్నా ఇప్పుడు ప్రతిపక్షాలు మరింతగా విడిపోయి ఉన్నాయన్నారు. ఆంధ్రలోఒప్పందం ఉందా, పశ్చిమ బెంగాల్‌లో ఒప్పందం ఉందా, కమ్యూనిస్టులతో ఏదయినా ఒప్పందం ఉందా, ఒడిశా.. కేరళ.. ఇలా ఏ రాష్ట్రంలో ప్రతిపక్షాల మధ్య ఒప్పందం ఉందో మీరే చెప్పండి’ అని ఆయన అన్నారు.

అంతేకాదు, ఎన్నికల తర్వాత ప్రతిపక్షాలు చేతులు కలిపే అవకాశముందన్న వార్తలను కూడా ప్రధాని తోసిపుచ్చారు. ‘ఇప్పుడు ఒకరినొకరు ఓడించుకోవడానికి అవి సర్వశక్తులు ఒడ్డుతున్నాయి. వాళ్ల ప్రకటనలను చూస్తేనే ఈ విషయం అర్థమవుతుంది’ అని ఆయన అన్నారు. అయితే మోడీకి జనం తక్కువ సీట్లు ఇచ్చినప్పుడు మాత్రమే వాళ్లు చేతులు కలిపే అవకాశముందన్నారు. మోడీకి ప్రత్యర్థి ఎవరనే ప్రశ్న 2024లో తలెత్తవచ్చునేమో కానీ 2019లో మాత్రం పోటీయే లేదన్నారు. నిరుద్యోగం, ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శల గురించి అడగ్గా, లోపరహితమైన వ్యవస్థను తయారు చేయడం కోసం తాను కొత్త వ్యవస్థలను రూపొందించడానికి ప్రయత్నిస్తున్నానని మోడీ చెప్పారు. వాజపేయి ప్రభుత్వంలో 6 కోట్ల ఉద్యోగాలు సృష్టించబడినట్లు గణాంకాలు నిరూపించాయని, అదే యుపిఏ ప్రభుత్వం హయాంలో కేవలం ఒకటిన్నర కోట్ల ఉద్యోగాలే వచ్చాయని, అయినప్పటికీ కాంగ్రెస్ నేతలు వాజపేయి ప్రభుత్వంపై బురద చల్లడానికి ప్రయత్నించారని ప్రధాని అన్నారు.

ఉద్యోగాల సృష్టికోసం తమ ప్రభుత్వం చేస్తున్న కృషిని ప్రస్తావిస్తూ ముద్రా పథకం ద్వారా నాలుగు కోట్ల మంది బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకున్నారని, వాళ్లంతా కూడా వ్యాపారాలు ప్రారంభించి మరికొంతమందికి ఉద్యోగాలు కల్పించి ఉంటారని ఆయన అన్నారు. ఉద్యోగులు భవిష్యనిధి (ఇపిఎఫ్‌ఓ)లో కోటి మంది రిజిస్టర్ చేసుకున్నారని ఆయన అన్నారు. ‘గత ప్రభుత్వాలతో పోలిస్తే ఇప్పుడు దేశంలో భారీ ఎత్తున రోడ్ల నిర్మాణం జరుగుతోంది. రైల్వేలు రెట్టింపు స్థాయిలో పెరుగుతున్నాయి. భారీ పెట్టుబడులు కారణంగా దేశంలో సౌర విద్యుత్‌కోసం పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వీటివల్ల ఉద్యోగాలు రావడం లేదని వారు చెప్పగలరా?’అని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రధాని అన్నారు.