భారత జవాన్లకు శుభవార్త

SMTV Desk 2019-03-26 10:48:34  Bullet proof bus for jawans

ఫిబ్రవరి 14న జమ్మూకశ్మీర్‌లోని పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ జరిపిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భద్రతా బలగాల తరలింపులో కొన్ని మార్పులు తీసుకురానున్నట్లు సీఆర్‌పీఎఫ్ డైరెక్టర్‌ జనరల్‌ ఆర్‌.ఆర్‌. భట్నాగర్‌ సోమవారం తెలిపారు. మందుపాతరల పేలుడును తట్టుకునే, బుల్లెట్‌ ప్రూఫ్‌ బస్సులను కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఈ బస్సుల్లో 30 మంది జవాన్లు ప్రయాణించే వీలుంటుందన్నారు. అదే తరహాలో ఆరుగురు జవాన్లు ప్రయాణించేందుకు వీలుండే వాహనాలను కూడా అందించనున్నట్లు పేర్కొన్నారు.


సాధారణంగా జవాన్లను తరలించేందుకు ఎక్కువ శాతం 50 కంటే ఎక్కువ మంది ప్రయాణించేందుకు వీలుండే పెద్ద బస్సులను వినియోగిస్తారు. పుల్వామాలో దాడి జరిగినప్పుడు అటువంటి 78 బస్సుల్లో కాన్వాయ్‌గా జవాన్లు ప్రయాణిస్తున్నారు. పేలుళ్లను తట్టుకునే విధంగా బస్సులను తయారు చేయాలి. ఈ క్రమంలో బస్సు బరువు గణనీయంగా పెరుగుతుంది. దానిలో ఎక్కువ మంది ప్రయాణించేలా ఉండాలంటే ఆ బస్సు బరువు మరింత పెరుగుతుంది. తద్వారా ఇంజిన్‌పై భారం అధికంగా పడుతుంది. ఫలితంగా బస్సు వేగం తగ్గిపోతోంది. ఇది ఇంకో విధంగా ప్రమాదకరం. అందుకే 30 మంది ప్రయాణించడానికి వీలున్న చిన్న బస్సులకే మొగ్గుచూపుతున్నట్లు ఆయన తెలిపారు. అలాగే జవాన్లు ప్రయాణిస్తున్న సమయంలో వారికి తోడుగా ప్రయాణించే బాంబ్ స్క్వాడ్ సిబ్బందిని కూడా పెంచుతామని తెలిపారు. అలాగే సెలవులపై ఇంటికి వెళ్లే జవాన్లకు విమానయాన సౌకర్యం కూడా అందిస్తామని పేర్కొన్నారు.