అక్రమాస్తుల కేసులో ములాయం, అఖిలేష్‌కు సుప్రీం భారీ షాక్

SMTV Desk 2019-03-25 17:13:25  Supreme court,

న్యూఢిల్లీ : ఎన్నికలు సమీపిస్తున్న వేళ సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్‌ యాదవ్‌, పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లకు భారీ షాక్ తగిలింది. వీరిపై నమోదైన ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు ఈ వ్యవహారంలో కేసు నమోదు చేశారా లేదా అంటూ సీబీఐపై న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ములాయం కుటుంబం అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆదాయానికి మించి ఆస్తులను సమకూర్చుకుందని గతంలో ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఆరోపణలపై సీబీఐ దర్యాప్తు జరపాలంటూ కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్ చతుర్వేదీ 2005లో సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌ స్వీకరించిన కోర్టు 2007లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. 2012లో ములాయం, అఖిలేష్‌లు వేసిన రివ్యూ పిటిషన్లు కోర్టు కొట్టివేసింది. అయితే తాను వేసిన అక్రమాస్తులు కేసులో ఎటువంటి పురోగతి లేదంటూ పిటిషనర్‌, కాంగ్రెస్‌ నేత విశ్వనాథ్‌ చతుర్వేది కోర్టు దృష్టికి తేవడంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌గొగోయ్‌, జస్టిస్‌ దీపక్‌గుప్తాలతో కూడిన బెంచ్‌ స్పందించింది. కేసు దర్యాప్తు వివరాలను రెండు వారాల్లోగా తెలియజేయాలని, అలాగే వారిపై ఉన్న ఇతర కేసుల వివరాలు అందించాలని సీబీఐని ఆదేశించింది.