దేశ రాజధానిలో అగ్ని ప్రమాదం

SMTV Desk 2019-03-25 13:36:23  Fires accident

న్యూఢిల్లీ : దేశ రాజధానిలోని విఖ్యాత ఎయిమ్స్‌లో ఆదివారం సాయంత్రం అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ట్రౌమా సెంటర్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని, లోపలి మంటలు బయటకు వ్యాపించాయని, దీనితో ప్రజలు ప్రాణభయంతో పరుగులు తీశారని వెల్లడైంది. షార్టు సర్కూట్‌తోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని అధికారులు తెలిపారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చే చర్యలు చేపట్టారు. ప్రమాద కారణాలను నిర్థారించుకోవల్సి ఉందని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరుగుతోందని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. గాయాలకు చికిత్స జరిపే ట్రౌమా సెంటర్‌లోని ఆపరేషన్ థియేటర్‌లో మంటలను అదుపులోకి తెచ్చేందుకు హుటాహుటిన 20 అగ్నిమాపక దళాలు రంగంలోకి దిగాయి. ఈ సమయంలో థియేటర్‌లో ఎవరికి చికిత్స జరగడం లేదని వెల్లడైంది. మంటలు చెలరేగడంతో అక్కడి రోగులను వేరేచోటికి తరలించారు. ప్రాణనష్టం ఏమీ జరగలేదని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు తెలిపారు. కింది అంతస్తులోనే అగ్ని ప్రమాదం జరిగింది. దీనితో పెద్దగా ఇబ్బంది ఏర్పడలేదని , మంటలు అదుపులోకి వచ్చాయని ఆ తరువాత అగ్నిమాపక దళ అధికారి అతుల్ గార్గ్ తెలిపారు.