పాకాస్థాన్ లో హిందూ బాలికల కిడ్నాప్

SMTV Desk 2019-03-25 13:33:05  Pakistan, Kidnap,

న్యూఢిల్లీ : పాకిస్థాన్‌లో హిందూ అక్కాచెల్లెళ్ల పట్ల తీవ్ర అమానుషం జరిగింది. సింధ్ ప్రాంతంలో కుటుంబంతో నివసించే ఈ మైనరు బాలికలను ఎత్తుకెళ్లి, బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి పెళ్ళి చేయడం కలకలం రేపింది. హోలీ పండుగ రోజే జరిగిన ఈ ఘటనతో పాకిస్థాన్‌లోని హిందూ మైనార్టీలు తీవ్రస్థాయి నిరసనలకు దిగారు. ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతల వాతావరణం ఈ ఉదంతంతో మరింత రాజుకుంది.

సింధ్ ప్రాంతంలోని ఘోట్కీ జిల్లాలోని ధర్కి పట్టణంలో నివసించే ఇద్దరు బాలికలు 13 ఏండ్ల రవీనా, 15 ఏండ్ల రీనాలు ఇంట్లో రంగుల పండుగకు సిద్ధం అవుతున్నప్పుడే వారిని పలుకుబడి ఉన్న వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు వెల్లడైంది. కొద్ది సేపటికే ఇంటర్నెట్‌లో ప్రచారం పొందిన వీడియోలో ఈ ఇద్దరు అమ్మాయిలకు ఒక మత పెద్ద దగ్గరుండి నిఖా జరిపించడం కన్పించింది. దీనితో కుటుంబ సభ్యులతో పాటు ఈ ప్రాంతంలోని హిందూ కుటుంబాలన్నీ కలవరం చెందాయి. ముస్లిం పద్ధతి వివాహానికి ముందు ఈ బాలికలకు ముస్లిం మత స్వీకరణ ఘట్టం కూడా జరిపించినట్లు వెల్లడైంది. తొలుత ఈ ఇద్దరు బాలికల పెళ్లి తంతు తెలిపే వీడియోనే ప్రసారం అయింది. అయితే కొద్ది నిమిషాల వ్యవధిలోనే ఈ ఇద్దరు బాలికలు మాట్లాడుతున్న దృశ్యాలతో మరో వీడియో వెలుగులోకి వచ్చింది.

తాము తమంతతాముగా ఇస్లాం మతం పుచ్చుకున్నామని, మతమార్పిడి తరువాత జరిగిన నిఖాలో తమపై ఎవరి బలవంతం లేదని, ఇష్టపూర్తిగానే ఈ విధంగా చేశామని వారిద్దరూ చెప్పడం ఈ వీడియోలో ఉంది. ఈ ప్రాంతంలో ఆధిపత్యం చెలాయిస్తున్న మత ఛాందసవాదులే ఈ చర్యకు దిగారని, ఏకంగా బాలికలను కిడ్నాప్ చేశారని, ఇంతకంటే దారుణం మరోటి ఉండదని హిందూ సంస్థల వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ హిందూ సేవా సంక్షేమ సంస్థ అధ్యక్షులు సంజీష్ ధంజా పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ను కలిశారు. జరిగిన ఘటనను ఆయన దృష్టికి తెచ్చారు. పాకిస్థాన్‌లో మైనార్టీలు భద్రంగా ఉన్నారని అందరికీ చెప్పేలా చర్యలు తీసుకోవల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రధానికి స్పష్టం చేశారు. యుక్తవయస్సులోకి వచ్చిన హిందూ బాలికలు అనేక విధాలుగా వేధింపులకు గురవుతున్నారని ధంజా ఆవేదన వ్యక్తం చేశారు. సింధ్ ప్రాంతంలో పలుకుబడి గల వారి ఆగడాలు మితిమీరుతున్నాయి. తుపాకులు తీసుకుని వచ్చి ఇండ్లల్లోకి చొరబడి అమ్మాయిలను కిడ్నాప్ చేయడం, వారిని బెదిరించి ఇస్లాం మతం తీసుకునేలా చేయడం, ఆ తరువాత వారి ఇష్టాపూర్తిగానే పెళ్లి జరిగినట్లుగా చిత్రీకరించడం జరుగుతోందని అన్నారు. ముక్కుపచ్చలారని బాలికలను ముసలివారికి ఇచ్చి నిఖా జరిపిస్తున్నారని. అనేక రకాలుగా వేధించడంతో నిఖా జరుగుతోందని, ఆ తరువాత ఈ బాలికల పరిస్థితి దయనీయంగా మారుతోందని తెలిపారు. ఇక ఈ ఘటనపై వచ్చిన వార్తల పట్ల ప్రధాని ఇమ్రాన్ స్పందించారని, దర్యాప్తునకు ఆదేశించారని పాకిస్థాన్ సమాచార మంత్రి ఫవాద్ చౌద్రీ తెలిపారు.
పాతకక్షలతో కోహ్బర్, మాలిక్ తెగల కిరాతకం
హోలీ రోజున ఈ ప్రాంతంలో బాలికలను ఎత్తుకెళ్లింది అక్కడి కోహ్బర్, మాలిక్ తెగలకు చెందిన వారని హిందూ వర్గ నేతలు తెలిపారు. ఘటన జరిగిన వెంటనే బాలికల సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాత కక్షలతోనే బాగా పలుకుబడి ఉన్న వారు ఈ చర్యకు పాల్పడ్డారని తెలిపారు.

కొంతకాలం క్రితం తన తండ్రి నిందితులతో ఏదో విషయంపై గొడవ పడ్డాడని, దీనిని మనసులో పెట్టుకునే ఇప్పుడు ఏ పాపం తెలియని తన చెల్లెళ్లను కిడ్నాప్ చేశారని , హోలీకి సిద్ధం అవుతున్న వారిని పిస్టల్ చూపించి తీసుకువెళ్లారని వాపొయ్యారు. ఇంతకంటే అరాచకం మరోటి ఉండదని అన్నారు.
మైనర్ బాలికల మత మార్పిడి చెల్లదు
దుండగులు ఎత్తుకెళ్లిన బాలికలు పెళ్లీడుకు రాని మైనర్లు అని నిర్థారణ అయిందని పాకిస్థాన్ ముస్లిం లీగ్‌కు చెం దిన ఎంపి నంద్‌కుమార్ గోక్లనీ చెప్పారు. మైనార్టీ పిల్లల ఇస్లాం మత స్వీకరణ, పెళ్లి ఇష్టాపూర్తి గురించి చెప్పడాన్ని పరిగణనలోకి తీసుకోవడం కుదరదని, వీరి కిడ్నా ప్, మత మార్పిడి, పెళ్లి అన్నీ నేరాలే అని చెప్పారు. బలవంతపు మతమార్పిడులకు వ్యతిరేకంగా ఈ జాతీయ అసెంబ్లీ సభ్యుడు అంతకు ముందే ఒక బిల్లు తీసుకువచ్చారు. అయితే ఇది పెండింగ్‌లో ఉంది. ప్రభుత్వం ఈ బిల్లును వెంటనే ఆమోదించి, మత మార్పిడులను నిరోధించాల్సి ఉందని డిమాండ్ చేశారు. ఇక ఈ ఘటనపై స్థానిక పోలీసులు స్పందించారు. ఒక వ్యక్తిని అరెస్టు చేసినట్లు, ఇతరులను పట్టుకునేందుకు సోదాలు చేపట్టినట్లు వివరించారు.