కోల్‌కత్తా vs హైదరాబాద్ .. గెలుపు ఎవరిది ?

SMTV Desk 2019-03-25 11:18:14  kolkata, hyderabad,

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్ టోర్నమెంట్ శనివారం అంగరంగ వైభవంగా ప్రారంభమైనది. శనివారం జరిగిన మొదటి మ్యాచ్‌లో బెంగళూరుపై చెన్నై జట్టు ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో ఈరోజు హైదరాబాద్ వెర్సెస్ కోల్కత్తా జట్లు తలపడనున్నాయి. ఈ నేపథ్యంలో అందరి కళ్ళు 2016 లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ఐపీఎల్‌ ఛాంపియన్‌గా నిలిపిన స్టార్ ప్లేయర్ వార్నర్‌ పైనే ఉన్నాయి. బాల్‌ టాంపరింగ్‌కు పాల్పడి నిషేధానికి గురై మళ్ళీ జట్టులోకి వచ్చాడు వార్నర్. క్రికెట్‌ ఆస్ట్రేలియా విధించిన నిషేధం పూర్తి కావడానికి మరికొన్ని రోజులు మిగిలున్నా అతడు ముందే ఐపీఎల్‌లో ఆడబోతున్నాడు. నిషేధం కారణంగా గతేడాది బీసీసీఐ స్మిత్‌, వార్నర్‌లను టోర్నీకి అనుమతించని సంగతి తెలిసిందే. ఐతే ఈసారి ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు.

మరో నాలుగు రోజుల్లో వారికి విధించిన శిక్ష పూర్తవనుంది. 2019 ఐసీసీ ప్రపంచకప్‌ ముందు చివరి అవకాశం కావడంతో సత్తా చాటి ఆస్ట్రేలియా జట్టులో చోటు సంపాదించాలని డేవిడ్‌ వార్నర్‌ యోచిస్తునాడు. వార్నర్‌ సారథ్యంలోనే సన్‌రైజర్స్‌ 2016లో విజేతగా నిలిచింది. 2017 టోర్నీలో వార్నరే అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచాడు. వార్నర్‌ లేని సమయంలో సన్‌రైజర్స్‌ను నడిపించిన కేన్‌ విలియమ్సనే ఈసారి కూడా కెప్టెన్సీ చేయనున్నాడు. ఐతే భుజం గాయంతో ఇబ్బందిపడుతున్న అతడు కోల్‌కతాతో మ్యాచ్‌ ఆడేది అనుమానంగా మారింది. అతడి స్థానంలో వైస్‌కెప్టెన్‌ భువనేశ్వర్‌ సారథ్య బాధ్యతలు చేపట్టే అవకాశముంది. ఈరోజు కోలకతాలోని ఈడెన్ గార్డెన్స్ లో సాయంత్రం 4 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.