దక్షిణాదిపై ఫోకస్ పెట్టిన బీజేపీ

SMTV Desk 2019-03-23 12:32:08  Modi, BJP

మళ్ళీ దేశంలో బీజేపీ జెండా పాతి మళ్ళీ గద్దేనేక్కాలని చూస్తున్న మోడీ ఆ దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలుస్తోంది. అందుకే దక్షిణాదిలో బలం పెంచుకునేందుకు ఆయన స్వయంగా రంగంలోకి దిగుతున్నారని అంటున్నారు. గత ఎన్నికల్లో అఖండ మెజార్టీ సాధించి అధికారం చేపట్టిన బీజేపీ దక్షిణాదిలో మాత్రం చెప్పుకోదగ్గ స్థానాలు సాధించలేకపోయింది. రెండో సారి అధికారం చేపట్టాలని భావిస్తున్న బీజేపీ ఈసారి దక్షిణాదిపై ఫోకస్ పెడుతోంది. అందుకే మోదీ ఇక్కడి నుంచి పోటీ చేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.

దివంగత కేంద్రమంత్రి అనంత‌కుమార్ గత ఎన్నికల్లో బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేశారు. ఇప్పుడు అనంతకుమార్ లేకపోవడంతో ఈసారి ఆ టిక్కెట్ ఆయన భార్యకు కేటాయిస్తారని వార్తలు వినిపించాయి. తాజాగా కర్ణాటకలోని 28 నియోజకవర్గాలకు గాను 21సీట్లకు బీజేపీ అభ్యర్థులను ప్రకటించింది. బెంగళూరు సౌత్ సీటును మాత్రం పెండింగ్‌లో పెట్టింది. ఇక్కడి నుంచి మోదీ పోటీ చేయనున్న కారణంతో అభ్యర్థిని ప్రకటించలేదని వార్తలు వినిపిస్తున్నాయి. మోదీ బెంగళూరు సౌత్ నుంచి పోటీ చేస్తే రాష్ట్రంలో బీజేపీ కనీసం 22సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని పార్టీ అంచనా వేస్తోంది. మోదీ ఇప్పటికే వారణాసి నుంచి పోటీ చేస్తారని పార్టీ ప్రకటించింది. దక్షిణాదిన కూడా తమకు బలం ఉందని నిరూపించేందుకే బెంగళూరు నుంచి కూడా పోటీ చేయాలని మోదీ భావిస్తున్నట్లు సమాచారం.