చిరంజీవి బయోపిక్‌ కి నాగబాబు చెక్ ?

SMTV Desk 2019-03-12 09:26:55  chiranjeevi, Biopic, nagababu

హైదరాబాద్, మార్చ్ 12: సినిమా ఇండస్ట్రీ లో ప్రస్తుతం బయోపిక్‌ల హవా నడుస్తోంది. టాలీవుడ్‌, బాలీవుడ్‌ ఎందులో చూసినా.. పలు రంగాల్లో ప్రముఖులుగా నిలిచిన వారి జీవిత చరిత్రల ఆధారంగా సినిమాలను తెరకెక్కిస్తున్నారు. సావిత్రి, ఎన్టీఆర్‌, వైఎస్సార్‌, సంజయ్‌ దత్‌, ధోనీ, సచిన్‌ ఇలా ప్రముఖుల బయోపిక్‌లు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. అయితే ఈ ఏడాది సినీ ప్రముఖులైన సావిత్రి, ఎన్టీఆర్‌ల జీవిత చరిత్రలను వారు పడ్డ కష్టాలను సినిమాలుగా చూపించినట్లు , రానున్న రోజుల్లో టాలీవుడ్‌ టాప్ హీరో మెగాస్టార్‌ చిరంజీవి బయోపిక్‌ కూడా తీయబోతున్నారని వార్తలు వినిపించాయి. ఇందులో చిరంజీవిగా రామ్‌ చరణ్‌ నటించనున్నట్లు కూడా పుకార్లు షికార్లు చేశాయి. వీటికి చిరంజీవి సోదరుడు నాగబాబు చెక్‌ పెట్టారు.

చిరంజీవిపై బయోపిక్‌ తీయకపోడమే మంచిదని నాగబాబు అన్నారు. ఆ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. సావిత్రి, సిల్కస్మిత, సంజయ్‌ దత్‌ల జీవితాలు వేరు, వారి జీవితాల్లో ఎన్నో ఒడిదొడుకులున్నాయి, విభిన్నమైన మలుపులు ఉన్నాయి, కానీ చిరంజీవి జీవితం అలా కాదని నాగబాబు అంటున్నారు. వారి సినిమాలు తీస్తే ప్రేక్షకులు ఆదరించారు,ఎందుకంటే ఓ వ్యక్తి జీవితంలో ఒడిదొడుకులు అనేవి బయోపిక్‌కు ఆధారం అన్నారు. చిరంజీవి మొదట్లో ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ.. కొంత కాలంగా చాలా విజయవంతంగా జీవితాన్ని గడిపారని నాగబాబు అంటున్నారు. కాబట్టి చిరంజీవి బయోపిక్‌ తీయపోవడమే మంచితని నాగబాబు వ్యాఖ్యానించారు. మరి ఈ మాటలు విన్న సినీ వర్గాలు చిరు బయోపిక్‌కు ముందుకు వస్తారో లేదో చూడాల్సిందే.