కన్నడ యంగ్ హీరో యష్ కి బెదిరింపు కాల్స్

SMTV Desk 2019-03-10 12:51:20  kannada, young hero,

బెంగుళూరు, మార్చ్ 10: ‘కెజిఎఫ్’ చిత్రంతో దేశవ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు కన్నడ యంగ్ హీరో యష్. దేశంలోని ప్రధాన భాషల్లో ఈ మూవీ విడుదలై ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో యష్ కు దేశవ్యాప్తంగా అభిమానగణం ఏర్పడింది. ఆయన గురించి ఏ చిన్న వార్త బయటకు వచ్చిన అభిమానులు ఎంతో ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ క్రమంలో శనివారం యష్ కు సంబంధించిన ఓ వార్త తెగ హల్ చల్ చేసింది. గుర్తుతెలియని వ్యక్తులు యష్ ను చంపేందుకు సుపారీ ఇచ్చారనేది ఈ వార్త సారాంశం. దీంతో ఈ వార్త సోషల్ మీడియాతో పాటు కన్నడ స్థానిక మీడియాలో సైతం వైరల్ లా వ్యాపించింది. ఈ వార్తతో యష్ అభిమానులు కంగారుపడ్డారు. దీంతో మీడియా సమావేశం నిర్వహించిన యష్ తన గురించి తప్పుడు రాతలు రాయటం, అనవసరంగా అసత్య ప్రచారం చేయటం ఆపాలని మీడియా వర్గాలను కోరాడు.

తనకు ఎవరితో ఎలాంటి శతృత్వం లేదని, తనను ఎవరూ ఏమీ చేయరని, అసత్య ప్రచారాలను నమ్మొదంటూ అభిమానులను సూచించాడు. ఈ విషయమై సిసిబి అడిషనల్‌ కమిషనర్‌ అలోక్‌కుమార్‌తో చర్చించినట్లు చెప్పాడు. అంతేగాక హోం మంత్రి ఎంబి పాటిల్‌తో కూడా మాట్లాడినట్లు యశ్‌ మీడియా సమావేశంలో తెలిపాడు. తనపై సుపారీ ఇచ్చేంత రాగద్వేషాలు కన్నడ సినీ పరిశ్రమలో ఎవరికీ లేవని, అనవసరంగా అసత్యప్రచారం చేస్తున్నారని యష్ ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశాడు. మీడియాలో ప్రచారం జరుగుతున్నట్లుగా తనను గుర్తుతెలియని వ్యక్తులు బెదిరింపు కాల్స్‌ చేసినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.