నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం

SMTV Desk 2019-03-08 13:42:37  Womens day,

నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మహిళలందరికీ శుభాకాంక్షలు. నేడు మహిళలు పురుషులతో సమానంగా పోటీపడుతూ అన్ని రంగాలలో దూసుకుపోతున్నారు. అయితే నేటికీ పురుషాధిక్యత ప్రపంచంలో మహిళలు తీవ్ర వివక్షను, వేధింపులను, దాడులను ఎదుర్కొంటూనే ఉన్నారు. ఒక పురుషుడు ఉన్నత శిఖరాలు ఎదగడానికి కుటుంబమూ, సమాజం కూడా తోడ్పడతాయి. కానీ మహిళలు మాత్రం పురుష ప్రపంచం నుంచి అడుగడుగునా వివక్ష, సవాళ్ళు ఎదుర్కొంటూ స్వశక్తితోనే ఎదగవలసివస్తోంది. నేటికీ చాలా ప్రాంతాలలో వారికి కనీసం కుటుంబ సభ్యులా తోడ్పాటు కూడా లభించడం లేదు. అనేక సమస్యలు, సవాళ్ళు ఎదుర్కొంటూ పైకి ఎదగాలని ప్రయత్నించే మహిళలకు ఉద్యోగాలలో, మంత్రివర్గాలలో, చట్టసభలలో సముచిత స్థానం కోసం పోరాడవలసి వస్తోంది. మహిళల పట్ల వివక్షకు ఇది అద్దం పడుతోంది.

అయినప్పటికీ మహిళలు ఎవరికివారు ఒంటరిపోరాటాలు చేస్తూ జీవితంలో ఉన్నత శిఖరాలు చేరుకొంటున్నారు. మహిళలు ఎదుర్కొంటున్న ఈ సమస్యలన్నిటికీ పరిష్కారాలు మహిళల చేతిలోనే ఉన్నాయనే సంగతి వారు గ్రహించకపోవడం వలననే అనాదిగా వారు ఏటికి ఎదురీదవలసి వస్తోందని చెప్పక తప్పదు.

యావత్ ప్రపంచానికి మొదటి గురువు తల్లే. ఆ తల్లి మార్గదర్శనంలోనే ఎవరైనా ఈ ప్రపంచంలోకి అడుగుపెట్టాలి. కనుక మహిళలకు సమాన గౌరవం, సమానవకాశాలు కల్పించే విధంగా తమ పిల్లలకు బాల్యం నుంచే నేర్పించగలిగితే క్రమంగా సమాజ ప్రవర్తనలో, ఆలోచన తీరులో మార్పులు మొదలయ్యే అవకాశం ఉంటుంది.