న్యూస్ అఫ్ ది డే ... ఆసియా క్రీడల్లోకి క్రికెట్

SMTV Desk 2019-03-05 12:09:41  Asia , Cricket.

హైదరాబాద్, మార్చ్ 04: క్రికెట్ బహుశా అన్ని క్రీడల్లోకల్లా ఎక్కువ సమయం తీసుకునే స్పోర్ట్. అందుకే క్రికెట్ ఒలింపిక్స్ వంటి టోర్నమెంట్లలో ప్రవేశం దక్కించుకోలేకపోయింది. కానీ ఆసియా క్రీడల్లో రెండు పర్యాయాలు క్రికెట్‌ను ప్రవేశపెట్టి.. మళ్ళీ తొలగించారు. తాజా సమాచారం ప్రకారం ఆసియా క్రీడల్లో క్రికెట్‌ తిరిగి దర్శనమివ్వనుంది. చైనాలోని హాంగ్జౌలో జరిగే 2022 ఆసియా క్రీడల్లో క్రికెట్‌ను తిరిగి ప్రవేశపెట్టనున్నారు. ఆదివారం ఒలింపిక్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఆసియా సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

2010, 2014 క్రీడల్లో నిర్వహించిన క్రికెట్‌ను 2018లో తొలగించారు. అయితే ఇంతవరకు ఆసియా క్రీడల క్రికెట్‌ పోటీల్లో టీమ్‌ఇండియా పాల్గొనలేదు. 2022 ఆసియా క్రీడలకు ఇంకా సమయం ఉంది కాబట్టే క్రికెట్‌లో భారత్‌ ప్రాతినిథ్యం వహించే విషయం గురించి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని బీసీసీఐ తెలిపింది. “వచ్చే ఆసియా క్రీడలకు ఇంకా చాలా సమయం ఉంది. అప్పటిలోపు క్రికెట్‌లో భారత్‌ పోటీపడుతుందో లేదో అనే విషయంపై చర్చించి.. ఓ నిర్ణయం తీసుకుంటాం” అని బీసీసీఐ ప్రతినిధి తెలిపాడు. 2010 క్రీడల క్రికెట్‌లో శ్రీలంక, పాకిస్థాన్‌ వరుసగా పురుషుల, మహిళల విజేతలుగా నిలిచాయి. 2014లో పురుషుల విభాగంలో బంగ్లాదేశ్‌, మహిళల విభాగంలో పాకిస్థాన్‌ స్వర్ణాలు సొంతం చేసుకున్నాయి.