రైలు తప్పిపోయిందా...చింతించవద్దు

SMTV Desk 2019-03-05 11:41:08  Railway, South East central railway

దూరప్రయాణాలు చేసేవారు ఒక్కోసారి రెండు మూడు రైళ్లు మారవలసి వస్తుంటుంది. కనుక మొదటి రైళ్లు సకాలంలో గమ్యస్థానం చేరుకొంటేనే తరువాత రైలును అందుకోగలుగుతారు. కానీ మన రైళ్లు నిర్ధిష్ట సమయానికి గమ్యం చేరుకొంటాయనే నమ్మకం లేదు. కనుక చాలాసార్లు కనెక్టింగ్ ట్రైన్స్ అందుకోలేక ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతుంటారు. ఈ సమస్యపై దృష్టి పెట్టిన రైల్వేశాఖ ఒకవేళ మొదటిరైలు ఆలస్యం కారణంగా కనెక్టింగ్ ట్రైన్స్ అందుకోలేకపోతే, కనెక్టింగ్ ట్రైన్ టికెట్ కోసం ప్రయాణికులు చెల్లించిన మొత్తం సొమ్మును వాపసు చేయాలని నిర్ణయించింది.

కానీ సొమ్ము వాపసు చేసినంత మాత్రన్న ఇతర ప్రాంతాలలో చిక్కుకొన్న ప్రయాణికుల కష్టాలు తీరిపోవు. తమ గమ్యస్థానం చేరుకోవడానికి మళ్ళీ వేరే ట్రైన్ చూసుకొని అందులో రిజర్వేషన్ సంపాదించుకోవడం చాలా కష్టం. ఈ సమస్యను కూడా రైల్వేశాఖ సానుభూతితో పరిశీలిస్తోంది.

ఒకవేళ కనెక్టింగ్ ట్రైన్ అందుకోలేకపోతే, దాని తరువాత వచ్చే రైలులో బెర్తులు ఖాళీలు ఉంటే ముందుగా వారికే కేటాయించాలని, ఒకవేళ సీట్లు, బెర్తులు కాళీ లేకపోయినా రిజర్వ్ బోగీలో సర్దుకుపోయి వెళ్ళేందుకు అభ్యంతరం లేకపోతే ఆవిధంగానూ ప్రయాణించేందుకు ప్రయాణికులను అనుమతించాలనే ప్రతిపాదనను రైల్వేశాఖ పరిశీలిస్తోంది. త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకొని మార్గదర్శకాలు రూపొందించవచ్చునని సమాచారం.