సిక్సర్ల వీరుడు క్రిస్ గేల్ మరో రికార్డు

SMTV Desk 2019-02-28 10:10:00  Chris gayle, Sixers five hundred, world record, Eng vs Wi ODI, Cricket

స్పోర్ట్స్ డెస్క్, ఫిబ్రవరి 28: ప్రపంచ క్రికెట్ లో విధ్వంసకర ఆటగాడిగా పేరు తెచ్చుకున్న క్రిస్‌గేల్, మరో సునామీ ఇన్నింగ్స్‌తో రెచ్చిపోయాడు. అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. సెయింట్ జార్జ్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగో వన్డేలో గేల్ విశ్వరూపం ప్రదర్శించాడు. ఆరు నెలల తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన ఈ వింధ్వంసకర ఆటగాడు చెలరేగి ఆడుతున్నాడు. నాలుగు వన్డేల్లో రెండు సెంచరీలు బాది తన ఫామ్ ని ప్రపంచానికి మరోమారు తెలియజెప్పాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 418 పరుగుల భారీ స్కోరు చేసింది. కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ 88 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్సర్లతో 103 పరుగులు చేయగా, వికెట్ కీపర్ జోస్ బట్లర్ 77 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 150 పరుగులు చేశాడు. అనంతరం 419 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన విండీస్ 48 ఓవర్లలో 389 పరుగులు చేసి ఓటమి పాలైంది. ఓపెనర్ క్రిస్ గేల్ ఇంగ్లిష్ బౌలర్లపై సునామీలా విరుచుకుపడ్డాడు. 97 బంతుల్లో 11 ఫోర్లు, 14 సిక్సర్లతో 162 పరుగులు చేశాడు. అయినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. కాగా, ఈ మ్యాచ్‌లో సిక్సర్లతో విరుచుకుపడిన 39 ఏళ్ల గేల్.. అంతర్జాతీయ క్రికెట్‌లో 500 సిక్సర్లు బాదిన తొలి ఆటగాడిగా ప్రపంచ రికార్డు సృష్టించాడు. అలాగే, వన్డేల్లో 300 సిక్సర్లు నమోదు చేసిన రెండో క్రికెటర్‌గానూ రికార్డులకెక్కాడు. గేల్ తాజా సిక్సర్లతో అతడు బాదిన సిక్సర్ల సంఖ్య 506కు చేరుకుంది. టెస్టుల్లో 98 సిక్సర్లు, వన్డేల్లో 305, టీ20ల్లో 103 సిక్సర్లు నమోదు చేశాడు.
సిక్సర్ల విషయంలో గేల్ తర్వాత 476 సిక్సర్లతో పాక్ మాజీ ఆటగాడు షాహిద్ అఫ్రిది రెండో స్థానంలో ఉండగా, 398 సిక్సర్లతో బ్రెండన్ మెకల్లమ్, 352 సిక్సర్లతో ఎంఎస్ ధోనీ, 352 సిక్సర్లతో సనత్ జయసూర్య వరుసగా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నారు.