సరిహద్దులలో పౌరుల రాకపోకలు నిషేధం..

SMTV Desk 2019-02-27 13:30:46  Pakistan border, Security, Panjab, Gujrat, Central Goverment, IB

న్యూడిల్లీ, ఫిబ్రవరి 27: ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పాకిస్తాన్ పై జరిపిన వైమానిక దాడుల నేపథ్యంలో పాక్ సరిహద్దుల్లో రాత్రివేళ పౌరుల రాకపోకలపై భారత సైన్యం నిషేధం విధించింది. సరిహద్దుల్లో నివసించే ప్రజలను ఖాళీ చేయించక పోయినా సరిహద్దు ప్రాంతమైన ఐదు కిలోమీటర్ల పరిధిలో పౌరులు సంచరించవద్దని సైనికులు కోరారు. రాజస్థాన్ రాష్ట్రంలో పాక్ మీదుగా 1,048 కిలోమీటర్ల సరిహద్దు విస్తరించి ఉంది. ఏప్రిల్ మొదటివారం వరకు సరిహద్దుల్లోని ఐదు కిలోమీటర్ల పరిధిలో రాత్రి 6 నుంచి ఉదయం 7 గంటలకు వరకు సామాన్య ప్రజల రాకపోకలను నిషేధించారు.

గుజరాత్ లోని సరిహద్దులలో భద్రతా చర్యలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విజయ్ రూపానీ యాంటీ టెర్రరిస్టు స్క్వాడ్, ఇంటలిజెన్స్ బ్యూరో, సరిహద్దు జిల్లాల ఐజీలతో సమీక్షించారు. బీఎస్ఎఫ్, ఆర్మీ, కోస్ట్ గార్డ్ భద్రతా బలగాలతో సమన్వయం చేసుకుంటూ సరిహద్దు ప్రాంతాల పౌరులకు కట్టుదిట్టమైన భద్రత కల్పించాలని సీఎం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. కశ్మీర్ లోయలో ఉన్న అఫ్జల్ గురు స్క్వాడ్, జైషే తీవ్రవాదులతోపాటు స్లీపర్ సెల్స్ ఉన్నందున వాటిపై దృష్టి సారించాలని ఇంటలిజెన్స్ ఏజెన్సీ ఆదేశించింది. పంజాబ్ లోని 553 కిలోమీటర్ల పాకిస్థాన్ సరిహద్దుల్లో పౌరుల రక్షణకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఐబీ డీజీపీలను ఆదేశించింది. దీంతోపాటు పాకిస్థాన్ సరిహద్దుల్లో వచ్చే మూడురోజుల పాటు బీఎస్ఎఫ్ బలగాలు అత్యంత అప్రమత్తంగా ఉంటూ పెట్రోలింగ్ ను ముమ్మరం చేయాలని కేంద్రం ఆదేశించింది.