పాక్ యుద్ధ విమానాలు భారత గగనతలంలో చక్కర్లు

SMTV Desk 2019-02-27 13:27:00  Pakistan, Fighter Jet, India, Airport

శ్రీనగర్, ఫిబ్రవరి 27: మంగళవారం తెల్లవారుజామున భారత సైన్యం, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద స్థావరంపై దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిలో సుమారు 350 మంది ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. కాగా, ఈరోజు షోపియన్ జిల్లా మేమండర్ ప్రాంతంలో ఉగ్రవాదులకు భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో ఇద్దరు జైషే మహ్మద్ టెర్రరిస్టులు హతమయ్యారు. దీంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పాక్ దాడికి ప్రతీకారంగా వారి యుద్ధ విమానాలు భారత భూభాగంలోకి దూసుకొచ్చాయి. తాజాగా జమ్మూకశ్మీర్ లోని రాజౌరీ జిల్లా నౌషేరా సెక్టార్ లో పాక్ యుద్ధ విమానాలు చక్కర్లు కొట్టాయి.

"మీరు భారత గగనతలంలోకి ప్రవేశించారు. వెంటనే వెనక్కి వెళ్లిపోండి" అంటూ అధికారులు హెచ్చరించిన పాక్ ఫైటర్ జెట్లు వెనక్కి తగ్గలేదు. దీంతో రంగంలోకి దిగిన భారత యుద్ధ విమానాలు పాక్ ఫైటర్ జెట్లును తరిమి కొట్టాయి. అయితే ఈ విషయం పట్ల భారత్, పాకిస్తాన్ ప్రభుత్వాలు ఇంతవరకూ అధికారికంగా స్పందించలేదు. కాగా, పాకిస్తాన్ భారత గగనతలాన్ని ఉల్లంఘించిన నేపథ్యంలో లేహ్, జమ్మూ, శ్రీనగర్, పఠాన్ కోట్ ఎయిర్ పోర్టుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. శ్రీనగర్ ఎయిర్ పోర్టులో పౌర విమానాల రాకపోకలను నిలిపివేశారు.