రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని పాక్ పై దాడి

SMTV Desk 2019-02-27 10:26:36  Pakistan, India, Attack, Fighter Jets, Radars

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: జమ్మూ కాశ్మీర్ లోని పుల్వామా ఉగ్రదాడి తరువాత, భారత్ ఖచ్చితంగా స్పందిస్తుందన్న విషయం పాకిస్తాన్ కు తెలుసు. అందుకు ముందుగానే అప్రమత్తమైన పాక్ సరిహద్దుల్లో కాపలాను పెంచింది. భారత్ ఎదురు దాడికి దిగితే తిప్పికొట్టాలని సైన్యానికి ఆదేశాలు కూడా జారీ చేసింది. అయితే, నిన్న తెల్లవారుజామున భారత యుద్ధ విమానాలు సులభంగా పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ ప్రాంతంలోకి వెళ్లి అనుకున్న దాడులు చేసివచ్చాయి. భారత ఫైటర్ జెట్స్ వస్తున్నాయన్న సంగతిని ఆ దేశ రాడార్లు గమమనించలేదు. పాక్ గగనతలంలోకి మన జెట్స్ ఎలా వెళ్లాయి, వీటిని ఎందుకు రాడార్లు చూడలేదు అన్న విషయాలు గమనిస్తే...

ఆర్థిక ఇబ్బందుల్లో పీకల్లోతు మునిగివున్న పాక్, పాతకాలపు రాడార్లనే వాడుతోంది. కాగా, వీటితో సరిహద్దు మొత్తంపై నిఘా పెట్టే వీలు లేదు. భారత విమాన స్థావరాలు ఎక్కడుంటాయో, ఆ దిక్కుగా మాత్రమే వీటిని మోహరిస్తారు. అదేవిధంగా ఎక్కువ ఎత్తులో ఉండే విమానాలను రాడార్లు సులువుగా గుర్తిస్తాయి. ఈ రెండు విషయాలను దృష్టిలో పెట్టుకుని, పాక్ ఊహించని మార్గాల ద్వారా విమానాలను తక్కువ ఎత్తులో తీసుకెళుతూ, భారత సైన్యం దాడులు జరిపింది. ఇదే సమయంలో ఐఏఎఫ్ విమానాల్లో అత్యాధునిక రాడార్ జామర్ల వ్యవస్థ కూడా ఉండటంతో, వాటి సాయంతో పాకిస్థాన్ రాడార్లు పనిచేయకుండా చేసి, ఆ విషయాన్ని పాక్ అధికారులు గుర్తించేలోగా, పని ముగించుకుని వచ్చేశారని రక్షణ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు.