హైదరాబాద్, ఫిబ్రవరి 27: విజయ్ దేవరకొండ హీరోగా సక్సెస్ అయిన తర్వాత అతని అభిమానులు కూడా అతన్ని అనుకరించడం మొదలుపెట్టారు. దీంతో విజయ్ గతేడాది రౌడీ అనే దుస్తుల బ్రాండ్‌ను ప్రారంభించాడు. విజయ్ కి ఉన్న క్రేజ్ వల్ల రౌడీ బ్రాండ్ కి యూత్ లో మంచి ఆదరణ లభించింది. దీంతో వ్యాపారస్థులు ఈ బ్రాండ్ పేరుతో నకిలీ దుస్తుల్ని తయారు చేస్తున్నారు. ఈ దుస్తులను జనరిక్ పేరుతో ఈ కామర్స్ వెబ్‌సైట్ అమెజాన్‌లో అమ్ముతున్నారు. ఈ నకిలీ దుస్తులపై విజయ్ ఫోటోను ఉంచి విక్రయిస్తున్నారు. దీంతో బెంగుళూరుకు చెందిన రౌడీ ప్రైవేట్ లిమిటెడ్ అక్కడి సిటీ సివిల్ కోర్టులో దావా వేసింది. దీనిపై విజయ్‌కు అనుకూలంగా కోర్టు తీర్పు వెలువరించింది. నకిలీ రౌడీ బ్రాండ్‌ను అమ్మకూడదని అమెజాన్‌ను ఆదేశించింది.
ఈ కేసు విచారణ మార్చి 29న జరగనుంది. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ అసిస్టెంట్ ఆకాశ్ మీడియాతో మాట్లాడుతూ.. అమెజాన్‌లో రౌడీ బ్రాండ్‌ను అమ్ముతున్నట్టు తమ మేనేజర్లు గుర్తించారని.. అలాగే కొందరు అభిమానులు కూడా ఈ విషయాన్ని తమ దృష్టికి తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. ఇప్పటికే హైదరాబాద్‌లో తమ బ్రాండ్‌కి సంబంధించిన నకిలీ దుస్తులు అమ్ముతున్న వ్యాపారస్థులపై చర్య తీసుకున్నామని కానీ ప్రస్తుతం ఏపీ, కర్ణాటక నుంచి సమస్య ఏర్పడిందని అన్నారు.