రాబర్ట్ వాద్ర కేసులో మలుపు

SMTV Desk 2019-02-26 11:27:08  Robert Vadra, ED, Money Laundering Case, Political Entry, Facebook, Stay

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 26: ప్రముఖ వ్యాపారవేత్త, కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ భర్త రాబర్ట్‌ వాద్రా మనీ లాండరింగ్‌ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. అయితే, వాద్రాకు ఢిల్లీ కోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) విచారణపై స్టే విధించాలన్న వాద్రా కోరగా, అందుకు ఢిల్లీ కోర్టు నిరాకరించింది. మంగళవారం జరగనున్న ఈడీ విచారణకు హాజరుకావాలని వాద్రాను ఆదేశించింది. గతేడాది డిసెంబర్‌ 7న ఢిల్లీలో ఉన్న వాద్రా ఆఫీసుల్లో తనిఖీలు నిర్వహించిన ఈడీ పలు డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది. కాగా ఆ సేకరించిన డాక్యుమెంట్ల హార్డ్‌కాపీలను వాద్రాకు అందించాలని సీబీఐ ప్రత్యేక జడ్జి అరవింద్‌ కుమార్‌ ఈడీని ఆదేశించారు. తదుపరి విచారణను మార్చి 2కు వాయిదా వేశారు. వీటి ఆధారంగా ప్రస్తుతం తనను విచారిస్తోందని, ఈ డాక్యుమెంట్ల కాపీలను తనకు అందించాలని కోరుతూ వాద్రా కోర్టును ఆశ్రయించారు. డాక్యుమెంట్ల కాపీలు తనకు ఇచ్చేవరకు విచారణ ఆపేయాల్సిందిగా ఈడీని ఆదేశించాలని వాద్రా తన పిటిషన్‌లో కోరారు.

కాగా, రాబర్ట్‌ వాద్రా, ప్రస్తుతం తనపై ఉన్న కేసులన్నీ పూర్తయిన తర్వాత రాజకీయాల్లోకి వస్తానని వాద్రా అన్నారు. ఈ మేరకు సోమవారం ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. వాద్రా రాజకీయాల్లోకి వస్తున్నారని కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజకీయాల్లోకి వస్తా. ప్రజా సేవ చేస్తా. తొందరేముంది. తొలుత నాపై ఉన్న నిరాధార ఆరోపణలన్నీ తొలగిపోవాల్సి ఉంది. అలాగే నేను మార్పు తీసుకురాగలనని ప్రజలు కూడా నమ్మాలి అని తెలిపారు.