వివరంగా వివరించబడిన ఎన్నికల వివరాలు

SMTV Desk 2019-02-25 12:34:26  Election Commission, Lok Sabha, Polls

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 25: 2019 లోక్ సభ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం సిద్దం అవుతుంది. ఎన్నికల ప్రక్రియకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే రెడీ చేసుకుంది ఈసీ. కాగా దాన్ని విడుదల చెయ్యడానికి ప్లాన్ వేసుకుంటున్నట్లు తెలిసింది.

వచ్చే నెల 7-10 లోగా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్రం ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసుకుంటోంది. వచ్చే జూన్ 3 కల్లా 16వ లోక్ సభ పదవీ కాలం ముగుస్తుంది. వెంటనే కొత్త ప్రభుత్వం ఏర్పాటు కావాల్సి ఉంటుంది. అందుకు ఎన్నికలు జరిపించేందుకు షెడ్యూల్‌ను విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం తయారవుతోంది.

లోక్ సభ ఎన్నికలు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం రాష్ట్రాలతో పాటూ రాష్ట్రపతి పాలనలో ఉన్న జమ్మూకాశ్మీర్‌కి కూడా ఎన్నికలు నిర్వహించనున్నారు. అందువల్ల సాధ్యమైనంత త్వరగా షెడ్యూల్ విడుదల చేస్తే ఎన్నికల నిర్వహణకు అనువుగా ఉంటుదని ఎన్నికల సంఘం అభిప్రాయం వ్యక్తం చేస్తుంది.

ఈ ఎన్నికలకు 22.3 లక్షల బ్యాలెట్ యూనిట్లు, 16.3 లక్షల కంట్రోల్ యూనిట్లు, 17.3 లక్షల వీవీప్యాట్ యంత్రాలు అవసరం అవుతాయని ఎన్నికల సంఘం చెప్పింది. ఇప్పటికే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో, ప్రభుత్వ యంత్రాంగాలు సిద్ధంగా ఉన్నాయో లేదో అనే విషయాలు తెలుసుకోవడానికి ఎన్నికల సంఘం అధికారులు అన్ని రాష్ట్రాల్లో పర్యటనలు పూర్తి చేశారు.

కాగా, ఈ నెల 28 లోగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనే అధికారుల బదిలీలను పూర్తి చేయాలని అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ముఖ్య ఎన్నికల అధికారులను ఈసీ ఇటీవలే ఆదేశించింది. ఓ అంచనా ప్రకారం తెలంగాణలో ఏప్రిల్ 17న పార్లమెంటు ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. అలాగే ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉన్నందున రెండు దశల్లో నిర్వహించాలని ఈసీ అనుకుంటున్నట్లు తెలిసింది.

ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉంటాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా ఈసీకి సవాల్‌గా మారాయి. ఎండ ఎక్కువగా ఉంటే ఓటర్లు ఓటు వేసేందుకు ఆసక్తి చూపకపోవచ్చన్న ఆందోళన ఉంది. అందువల్ల వీలైనం త్వరగా ప్రక్రియ పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తోంది ఈసీ.