సోషల్‌ మీడియాలో కొత్త సూపర్‌ స్టార్‌..

SMTV Desk 2019-02-12 23:29:59  Priyanka Gandhi, twitter account, Social Media, shashi tharoor, rahul gandhi

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 12: ప్రియాంక గాంధీ ఇటీవల ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో ఆమె సోషల్‌ మీడియా ప్రపంచంలోకీ అడుగుపెట్టారు. ప్రియాంకాకు ఇప్పటివరకు సోషల్‌ మీడియాలో ఎలాంటి ఖాతా లేదు. కాగా ఆమె తన పేరు మీద సోమవారం అధికారికంగా ట్విటర్‌ ఖాతాను తెరిచారు. అయితే ఆమె ట్విటర్‌ను ప్రారంభించిన 15 నిమిషాల్లోనే ఫాలోవర్స్ సంఖ్య ఐదు వేలకు చేరగా.. పది గంటల్లో వారిసంఖ్య లక్షకు చేరింది.

దీనిపై కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, కేంద్ర మాజీమంత్రి శశిథరూర్‌ స్పందిస్తూ.. సోషల్‌ మీడియాలో కొత్త సూపర్‌ స్టార్‌ అడుగుపెట్టారంటూ ట్వీట్‌ చేశారు. లక్షకుపైగా ప్రియాంకను అనుసరిస్తుండగా ఆమె ఏడుగురిని అనుసరిస్తున్నారు. రాహుల్‌ గాంధీ, జ్యోతిరాదిత్య సింధియా, అశోక్‌ గెహ్లోట్‌, సచిన్‌ ఫైలెట్‌, అహ్మాద్‌ పటేల్‌, రణదీప్‌ సుర్జేవాలాలను ఆమె ఫాలో అవుతున్నారు. అయితే ఫాలోయింగ్ పరంగా కాంగ్రెస్‌ పార్టీలో రాహుల్ గాంధీ టాప్‌లో ఉండగా, శశిథరూర్‌ రెండవ స్థానంలో ఉన్నారు.