అతి వేగవంతమైన రైలుకు రాళ్ల దెబ్బ

SMTV Desk 2019-02-03 13:46:46  Vandemataram Express, Trail Run, Delhi

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 3: దేశంలోనే అతి వేగవంతమైన రైలుగా ట్రైన్ 18 వందేభారత్ ఎక్స్‌ప్రెస్ గంటకు 180 కిలో మీటర్ల కన్నా ఎక్కువ వేగంతో పరుగులు పెట్టిందని రైల్వే అధికారులు చెప్పారు. అయితే శుక్రవారం రాత్రి ట్రయల్ రన్ జరుపుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈ రైలుపై రాళ్లదాడి జరిగింది. రూ. 100 కోట్ల వ్యయంతో చెన్నైలో తయారైన ఈ రైలు, ఢిల్లీ నుంచి అలహాబాద్‌కు ట్రయల్ రన్ నిర్వహించడానికి వస్తున్న సమయంలో శకుర్‌బస్తీ వద్ద శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో ఈ దాడి జరిగింది. ట్రయల్ రన్ సందర్భంగా రైల్లో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది కూడా ఉన్నారు. ముందు భాగం నుంచి రెండో బోగీ ఈ రాళ్ల దాడిలో దెబ్బతిన్నది. ఢిల్లీ స్టేషన్‌కు వచ్చిన తర్వాత ఈ దాడి ఘటన గురించి ఆర్పీఎఫ్ అధికారులకు సమాచారం అందించారు. ఇప్పటివరకు ఈ ఘటనకు ఎవరు పాల్పడ్డారన్నది తేలలేదు.

ఈ దాడిలో ఎవరు గాయపడలేరు కానీ రైలు అద్దం పగిలింది. నెల రోజుల క్రితం కూడా ఇలాంటి ఘటనే జరిగిన విషయం తెలిసిందే. ఇంతకుముందు డిసెంబర్ 20న ఢిల్లీ, ఆగ్రా మధ్య ట్రయల్ రన్ సందర్భంగా కూడా ఈ రైలుపై రాళ్ల దాడి జరిగింది. ఇది స్వదేశంలో తయారైన తొలి ఇంజిన్ రహిత రైలు కావడం విశేషం. దేశంలోని శతాబ్ది రైళ్ల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు.