కేంద్ర సర్కార్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం....

SMTV Desk 2019-02-02 13:04:44  Central government, Supreme court, Central investigation director, Temporary officer, Justice arun mishra, Justice naveen sinha

న్యూ ఢిల్లీ, ఫిబ్రవరి 2: కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్‌ విషయంలో తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతవరకు కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టర్ ను ఎందుకు నియమించలేదని ప్రశ్నించింది. తాత్కాలికంగా నియమించిన వ్యక్తులని ఎక్కువ కాలం ఉంచడం మంచిది కాదని హెచ్చరించింది. ఈ అంశంపై శుక్రవారం జస్టిస్‌ అరుణ్‌ మిశ్రా, జస్టిస్‌ నవీన్‌ సిన్హాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. సిబిఐ డెరెక్టర్‌ పదవీ చాలా కీలకమైందని ఇప్పటికే ఆ పదవిని భర్తీ చేసి ఉండాల్సిందని వ్యాఖ్యానించింది. దీనిపై ప్రభుత్వం తరుపున అటార్నీ జనరల్‌ కెకె వేణుగోపాల్‌ వాదిస్తూ…ఇప్పటికే దీనిపై ప్రధానితో కూడిన వొక ఉన్నత స్థాయి కమిటీ సమావేశమైందని, శుక్రవారం మరోసారి సమావేశం నిర్వహించనుందని తెలిపారు. ప్రస్తుతం తాత్కాలిక డైరెక్టర్‌గా కొనసాగుతునన నాగేశ్వరరావు నియామకంలోనూ కమిటీ ఆమోదం ఉందని వివరించారు. శుక్రవారం సమావేశం జరగనందున్న అంశాన్ని పరిగణనలోకి తీసుకున్న కోర్టు ఈవిషయంలో విచారణను ఫిబ్రవరి ఆరో తేదీకి వాయిదా వేసింది. అలోక్‌ వర్మ తిరిగి నియమితులైన తర్వాత చేపట్టిన దస్త్రాల విషయంలో కొత్తగా బాధ్యతలు చేపట్టే డైరెక్టర్‌ విచారణ కొనసాగించాలని అటార్నీ జనరల్‌కు కోర్టు సూచించింది.

నాగేశ్వరరావును తాత్కాలిక ప్రాతిపదికన నియమించడం పట్ల కామన్‌ కాజ్‌ అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన వ్యాజ్యంపై శుక్రవారం విచారించిన కోర్టు ఈ మేరకు వ్యాఖ్యానించింది. పిటిషనర్‌ తరుపున వాదించిన ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌…నూతన డైరెక్టర్‌ నియామకంలో కమిటీ పారదర్శకత పాటించేలా ఆదేశించాలని కోర్టును కోరారు. దీనిపై స్పందించిన కోర్టు…ముందు నియామకం జరగనివ్వండి. తర్వాత నియామక ప్రక్రియలో ఏమైనా అవతవకలు జరగడం, పారదర్శకత పాటించినట్లు అనిపిస్తే కోర్టులో సవాల్‌ చేయొచ్చని పేర్కొంది. ఈ అంశాన్ని విచారిస్తున్న ధర్మాసనం నుంచి జస్టిస్‌ ఎన్‌వీ రమణ తప్పుకోవడంతో జస్టిస్‌ అరుణ్‌ మిశ్రాతో కూడిన మరో నూతన ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జస్టిస్‌ రంజన్‌ గోగోయ్, జస్టిస్‌ సిక్రీ తప్పుకున్న విషయం తెలిసిందే. నాగేశ్వరరావు నియామకం ఎంపిక కమిటీ సిఫార్సుల మేరకు జరగలేదన్న పిటిషన్‌దారుల ప్రధాన ఆరోపణ. అలాగే తాత్కాలిక డైరెక్టర్‌ నియమాకానికి ప్రాతిపదికగా తీసుకున్న అంశాలను సైతం వివరించాలని వారు పిటిషన్‌లో కోరారు.