నమ్మకం కోల్పోతున్న మోదీ..

SMTV Desk 2019-01-26 17:42:17  Mood of the Nation Survey, ache din, Lok Sabha Election 2019, Narendra Modi

న్యూఢిల్లీ, జనవరి 26: ప్రజలకి ఇచ్చిన హామీని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేకపోయారని ఎక్కువమంది అభిప్రాయపడ్డారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే ప్రజలకు మంచి రోజులు (అచ్చేదిన్‌) వస్తాయని గత ఎన్నికల్లో నరేంద్ర మోదీ హామీయిచ్చారు. కానీ ఈ వాగ్దానాన్ని నిలబెట్టుకోవడంలో ఆయన విఫలమయ్యారని దేశంలోని 65 శాతం మందిప్రజలు అభిప్రాయపడ్డారు. మోదీ పాలనతో తమకు మంచి రోజులు వచ్చాయని కేవలం 35 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు. ఆర్థిక నిర్వహణలో కాంగ్రెస్‌ పాలనతో పోల్చుకుంటే మోదీ ప్రభుత్వమే నయమని ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (ఎంవోటీఎన్‌) పేరుతో నిర్వహించిన సర్వేలో దాదాపు సగం శాతం మంది అభిప్రాయం వ్యక్తం చేశారు.

ఉచిత గ్యాస్‌ కనెక్షన్‌ కోసం బీజేపీ ప్రభుత్వం ప్రారంభించిన ప్రధానమంత్రి ఉజ్వల యోజన , మరుగుదొడ్ల నిర్మాణానికై ప్రవేశపెట్టిన స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ పథకాలు ప్రజల్లో బలమైన ముద్ర వేశాయని సర్వేలో వెల్లడైంది. కాగా నోట్ల రద్దు తర్వాత ప్రజలలో వ్యతిరేక​త పెరిగింది. రైతులు భారీగా నష్టపోవడం, చిన్న పరిశ్రమలు దెబ్బతినడం వల్ల ఉపాధి తగ్గిపోవడంతో గత రెండేళ్లలో మోదీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగినట్టు సర్వేలో తేలింది. ఇప్పటికిప్పుడు లోక్‌సభ ఎన్నికలు జరిగితే ఎన్డీఏ కూటమి 99 సీట్లు కోల్పోనుందని సర్వే అంచానా వేసింది.