సక్సెసఫుల్ దర్శకుల జాబితాలో కుర్ర డైరెక్టర్ ..

SMTV Desk 2019-01-19 11:30:00  Anil ravipudi, S S Rajamouli, Koratala siva, F2 Movie

హైదరాబాద్, జనవరి 19: ప్రస్తుత కాలంలో హీరోలకి, డైరెక్టర్‌లకి వొక హిట్ రావడమే గగనమైపోతుంటే.. కొందరు దర్శకులు మాత్రం హిట్ మీద హిట్ కొట్టేస్తున్నారు. ఫెయిల్యూర్ అనే పదాన్నీ చూడకుండా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్నారు. తాజాగా ఓ యువ దర్శకుడు కూడా ఆ జాబితాలో చేరాడు. ప్రేక్షకులను మెప్పించడంలో రాజమౌళి, కొరటాల శివ సిద్దహస్తులు. ఇప్పుడు అదే జాబితాలోకి దర్శకుడు అనిల్ రావిపూడి చేరిపోయారు. రచయితగా పరిచయమైన అనిల్ రావిపూడి శౌర్యం, ఆగడు, కందిరీగ, సుడిగాడు సినిమాలకు మాటలు రాశాడు.

కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన పటాస్‌తో దర్శకుడిగా మారి ఆయనకు మంచి హిట్‌ అందించాడు. మొదటి సినిమాతో కష్టపడి హిట్‌ కొట్టడమే కాకుండా, రెండో సినిమా సుప్రీమ్‌, మూడో సినిమా రాజాది గ్రేట్‌తో వరుసగా హిట్లు కొట్టి హ్యాట్రిక్ ని సొంతం చేసుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆయన దర్శకత్వంలో వచ్చిన నాలుగో సినిమా ఎఫ్‌-2 సంక్రాంతికి విడుదలై భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. త్వరలో రూ. 50 కోట్ల క్లబ్‌లో చేరుతుందని అంచనా. అనిల్ విజయానికి కామెడీ వెన్నెముకలా నిలుస్తోంది. ఈ దర్శకుడు తీసిన 4 సినిమాల్లో రొటీన్‌ కామెడీ కాకుండా ఫ్రెష్‌ కామెడీ పుష్కలంగా కనిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమాలో కథ కంటే కథనం ఆకట్టుకుంటుంది. ఇలా ఈ కుర్ర డైరెక్టర్ సక్సెస్ మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్‌లో ఉందని చెప్పొచ్చు.