లక్ష్మీ పార్వతి, చంద్రబాబు ఫస్ట్‌లుక్‌

SMTV Desk 2019-01-13 12:22:44  Laksmis NTR, RGV, chandra Babu,

హైదరాబాద్ , జనవరి 13: ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‌ చిత్రంలో లక్ష్మీ పార్వతిగా ఎవరు కనిపించబోతున్నారని చాలా రోజులుగా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలో అనేక మంది నటీమణుల పేర్లు బయటికి వచ్చాయి. అయితే ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌‌ను దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ శుక్రవారం విడుదల చేశారు. సినిమాలో కన్నడ నటి యజ్ఞా శెట్టి టైటిల్‌ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఆమె గతంలో వర్మ తీసిన ‘కిల్లింగ్‌ వీరప్పన్‌ సినిమాలో వీరప్పన్‌ భార్య ముత్తులక్ష్మి పాత్రలో నటించారు. ఓ కన్నడ చిత్రానికి గానూ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డును కూడా అందుకున్నారు.

అదేవిధంగా ఈ సినిమాలో నారా చంద్రబాబు నాయుడు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను కూడా వర్మ విడుదల చేశారు. లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్‌ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వర్మ తెలిపారు. ఇప్పటికే ఈ సినిమాలోని రెండు పాటల్ని ఆయన విడుదల చేశారు. ‘వెన్నుపోటు అనే పాటను వ్యతిరేకిస్తూ టీడీపీ నేతలు ఆరోపణలు కూడా చేశారు.

ఈ సినిమాకు ఎమ్‌.ఎమ్‌. కీరవాణి సోదరుడు కల్యాణ్‌ మాలిక్‌ సంగీతం అందిస్తున్నారు. రాకేష్‌ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు వర్మ ఇప్పటికే ప్రకటించారు. మరోపక్క ఈ సినిమాలోని పాటలు తనను చాలా బాధించాయని ఇటీవల మీడియాతో లక్ష్మీ పార్వతి అన్నట్లు సమాచారం.