కంటతడి పెట్టుకున్న ముఖ్యమంత్రి..

SMTV Desk 2019-01-10 11:39:47  karnataka, cm kumaraswami

బెంగుళూరు, జనవరి 10: కర్ణాటక సీఎం కుమారస్వామి జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఇటీవల కర్ణాటకలో ఎన్నికలు జరగగా కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ తీరు తనను తీవ్రంగా బాధిస్తోందని, సీఎంలా కాకుండా ఓ క్లర్కులా పనిచేపిస్తున్నారని సీఎం కుమారస్వామి ఆవేదన వ్యక్తం చేశారు. జేడీఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో జరిగిన సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేసినట్టు జేడీఎస్ ఎమ్మెల్యేలు కొందరు తెలిపారు. కుమారస్వామి ఏడ్చినంత పనిచేశారని, ఆయనతో కాంగ్రెస్ నేతలు బలవంతంగా సంతకాలు చేయించుకుంటున్నారని తమతో చెప్పినట్టు తెలిపారు.

ప్రస్తుత రోజులను సీఎం కష్టంగా గడుపుతున్నారని పేర్కొన్నారు. మరొక దారి లేక కాంగ్రెస్ నేతలు చెప్పినట్టు చేయాల్సి వస్తోందని సీఎం తమతో చెప్పారని వివరించారు. కేబినెట్‌ను విస్తరించాలంటూ కాంగ్రెస్ నేతలు తనపై వొత్తిడి తీసుకొస్తున్నారని చెబుతూ సీఎం ఆవేదన వ్యక్తం చేసినట్టు ఎమ్మెల్యేలు తెలిపారు. కాగా, ఈ విషయంపై సమయస్ఫూర్తి ధోరణితో వ్యవహరిద్దామని సమావేశానికి హాజరైన జేడీఎస్ అధినేత, మాజీ ప్రధాని హెచ్‌డీ దేవెగౌడ సూచించినట్టు తెలుస్తోంది.