రాజ్యసభలో ఈబీసీ బిల్లుపై విపక్షాల ఆందోళన..

SMTV Desk 2019-01-09 17:58:42  ebc 10 percent reservations, Rajya Sabha, thavar Chand Gehlot, NDA government, adjouned

న్యూఢిల్లీ, జనవరి 9: అగ్రవర్ణలలోని పేదలకు విద్యా, ఉద్యోగాల్లో10 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు వీలుగా ఎన్డీయే ప్రభుత్వం తీసుకువచ్చిన ఈబీసీ బిల్లును రాజ్యసభ ముందుకు తీసుకువచ్చారు. నిన్న లోక్‌సభలో ఆమోదం పొందిన ఈబీసీ బిల్లును కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లట్‌ ఎగువ సభలో ప్రవేశపెట్టారు. లోక్‌సభలో సులువుగా ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో మాత్రం కఠిన పరీక్షను ఎదుర్కొంటోంది. బిల్లును పూర్తిగా పరిశీలించాల్సిన అవసరం ఉందని, బిల్లును పార్లమెంట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపాలని విపక్షాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

చాలా కీలకమైన ఈ బిల్లును ఇంత హడావిడిగా ప్రవేశపెట్టాల్సిన అవసరం ఏంటని సభ్యులు ప్రశ్నిస్తున్నారు. రాజకీయ లబ్ధికోసమే బీజేపీ ప్రభుత్వం ఇప్పుడు ఈ బిల్లును తీసుకువచ్చిందని విపక్ష సభ్యులు పోడియం ముందు ఆందోళనకు దిగారు. బిల్లుపై చర్చించిన డీఎంకే సభ్యురాలు కనిమొళి పలు సవరణలు కోరారు. ఈబీసీ బిల్లుపై గెహ్లట్‌ మాట్లాడుతూ.. సామాజిక సమనత్వం కోసమే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు. సభ్యుల ఆందోళన వల్ల సభను రెండు గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఛైర్మన్‌ ప్రకటించారు. కాగా లోక్‌సభలో ఆమోదం పొందిన ఈ బిల్లు రాజ్యసభలో కూడా 2/3 వంతు మెజార్టీతో ఆమోదం పొందితే బిల్లు చట్టరూపం దాల్చనుంది.