ఎల్బ్రస్ పర్వతాన్ని అధిరోహించిన ఐదుగురిలో ఇద్దరు తెలంగాణ విద్యార్థులే!!

SMTV Desk 2017-07-28 12:09:04  social welfare girls, climbing elbrus mountain.

వరంగల్, జూలై 28 : ఐరోపా ఖండంలో ఎత్తైన ఎల్‌బ్రస్‌ పర్వత శిఖరం రష్యాకు చెందినది. నిత్యం మంచుతో నిండి, ప్రమాదకరమైందిగా భావించే ఈ పర్వతాన్ని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థినులు అధిరోహించి అరుదైన ఘనతను సాధించారు. కాగా తెలంగాణకు చెందిన పర్వతారోహకుడు శేఖర్‌బాబు ఆధ్వర్యంలో ఇబ్రహీంపట్నం గురుకుల డిగ్రీ విద్యార్థిని మాలావత్‌ పూర్ణ, యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులోని సాంఘిక సంక్షేమ గురుకుల విద్యార్థిని బొల్లెద్దు శ్రీవిద్యల బృందం భారత కాలమానం ప్రకారం ఈనెల 26న ప్రారంభించిన పర్వతారోహణను విజయవంతంగా పూర్తిచేశారు. అసలు విషయానికొస్తే తెలంగాణలో 53 గురుకుల డిగ్రీ కళాశాలలను మంజూరు చేసినందుకు గాను కృతజ్ఞతగా ఎల్‌బ్రస్‌ పర్వతంపై సీఎం కేసీఆర్‌ చిత్ర పటాన్ని, తెలంగాణ రాజ ముద్రను, జాతీయ పతాకాన్ని ఎగరవేశారు.. పర్వతాన్ని అధిరోహించేందుకు మనదేశం నుంచి వెళ్లిన ఐదుగురిలో తెలంగాణకు చెందిన వారు ఇద్దరు ఉండటం విశేషం. శ్రీవిద్య ప్రస్తుతం ఇంటర్మీడియట్‌ రెండో సంవత్సరం, పూర్ణ డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతున్నారు. వీరి తల్లిదండ్రులు కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారు.అయితే ఏడు ఖండాల్లోని ఎత్తైన పర్వతాలనూ అధిరోహించడమే తన లక్ష్యమని మాలావత్‌ పూర్ణ తెలిపారు. ఇప్పటికే ఎవరెస్టు, కిలిమంజారోలను అధిరోహించానన్నారు. శ్రీవిద్య మాట్లాడుతూ...లక్ష్యాన్ని ఛేదించినందుకు సంతోషంగా ఉందాని, శిఖరాగ్రానికి చేరాక అప్పటివరకూ పడిన కష్టాలన్నీ మరచిపోయానని తెలిపారు. వీరు సాధించిన ఈ ఘనత పట్ల ఆలేరు గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌ కె. శ్రీశైలం తదితరులు హర్షం వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా గురుకులాల్లో చదువుతున్న విద్యార్థినులు సాధించిన ఘనతపై సీఎం కేసీఆర్‌, మంత్రి జగదీష్‌ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారని గురుకులాల సొసైటీ కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌.ఎస్‌. ప్రవీణ్‌కుమార్‌ తెలిపారు. గురుకుల విద్యార్థులు పర్వతారోహకులుగా మంచి పేరు తెచ్చుకుంటున్నారంటూ విద్యార్థినులను అభినందించారు. ఇక్కడ చదివే విద్యార్థులు ఆర్థికంగా పేదలు కావచ్చు కానీ, శక్తి సామర్థ్యాల్లో కాదని వ్యాఖ్యానించారు.