ఆంధ్రప్రదేశ్ కు ప్రపంచబ్యాంకు రుణం

SMTV Desk 2017-05-31 19:35:38  ap,world bank, finance by electricity devlopement

ఢిల్లీ, మే 31 : ఆంధ్రప్రదేశ్‌కు ప్రపంచబ్యాంకు రుణం మంజూరైంది. అందరికీ విద్యుత్‌ పథకం కోసం రూ. 1,547.40 కోట్ల రూపాయలు ఇవ్వనున్నట్లు ఆ బ్యాంకు ప్రకటించింది. ఈ ప్రాజెక్టు వల్ల ఏపీలో విద్యుత్‌రంగానికి అనేక విధాలా ప్రయోజనం ఉంటుందని ప్రపంచ బ్యాంక్ ప్రతినిధి జునైద్ అహ్మద్ తెలిపారు. ట్రాన్స్‌మిషన్‌, డిస్ట్రిబ్యూషన్‌ లో మౌలికసదుపాయాలు మెరుగుపడతాయని చెప్పారు. సాంకేతిక సామర్థ్యం పెరిగి ఏపీ విద్యుత్‌ సంస్థలు ఆర్థికంగా బలపడతాయన్నారు. ఎంపిక చేసిన పట్టణాల్లో స్మార్ట్‌ గ్రిడ్లు ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. ఏపీలో విద్యుత్తుకు భారీగా డిమాండ్‌ పెరుగుతోందన్నారు. డిమాండ్‌కు తగ్గట్టు విద్యుత్‌ పంపిణీ చేయడానికి పెట్టుబడులు అవసరమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టు ఏపీ వృద్ధికి ఊతమిస్తుందని చెప్పారు. గృహాలు, పరిశ్రమలు, వ్యాపారసంస్థలకు నాణ్య మైన విద్యుత్‌ అందిస్తే ఏపీలో ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయని స్పష్టం చేశారు. సుస్థిర వృద్ధికి ఈ ప్రాజెక్టు తోడ్పడుతుందని, విద్యుత్‌రంగాన్ని మెరుగుపర్చేందుకు 2014 నుంచి ఏపీ ప్రభుత్వం గణనీయమైన చర్యలు తీసుకుందని చెప్పారు. ప్రభుత్వ ప్రణాళికలకు సహకారం అందిస్తామని జునైద్‌ అహ్మద్ స్పష్టం చేశారు.