నితీశ్ ఓ అవకాశవాది : లాలూ

SMTV Desk 2017-07-27 17:21:04  Bihar Chief Minister Nitish Kumar, RJD supremo Lalu Prasad Yadav,Prosecution, modi, amithsha

పట్నా, జూలై 27 : బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి బీజేపీతో చేతులు కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినందుకు ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. నితీశ్‌కుమార్‌ నమ్మక ద్రోహి అని ధ్వజమెత్తారు. నితీశ్‌ చేసిన మోసాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగడతామని ఆయన అన్నారు. బీజేపీతో నితీశ్‌ చేతులు కలుపడం మ్యాచ్‌ ఫీక్సింగేనని ఆరోపించారు. నితీశ్‌ ఎన్నోసార్లు ప్రధాని మోదీతో భేటీ అయి, విందుభోజనాలు స్వీకరించారని, అప్పుడే ఈ మ్యాచ్‌ ఫీక్సింగ్‌కు బీజాలు పడ్డయన్నారు. నితీశ్‌ను తాను ఇబ్బందులకు గురిచేయలేదని చెప్పారు. నితీశ్‌ తనకు తాను ప్రధాని స్థాయి నేతగా చెప్పుకొనేవారని, తాను తలుచుకుంటే ఆయనను సీఎంగా చేసి ఉండకపోయేవాడినని అన్నారు. 1991లో జరిగిన ఒక హత్య కేసులో నితీశ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారని, ఈ కేసుకు సంబంధించిన ప్రాసిక్యూషన్‌ను ఎదుర్కోవటానికి భయపడే మహాకూటమిని విచ్ఛిన్నం చేశారని లాలూ ఆరోపించారు. ఈ మేరకు నితీశ్ వివరణ దర్యాప్తు సంస్థలకు ఇస్తామని లాలూ స్పష్టం చేశారు.