పార్లమెంట్‌లో గందరగోళం...!

SMTV Desk 2018-12-27 12:49:28  parliment ,winter session, Rajya Sabha, Loksabha

న్యూఢిల్లీ, డిసెంబర్ 27 : క్రిస్‌మస్‌ పండుగ విరామం తరువాత గురువారం ప్రారంభమైన పార్లమెంట్‌ ఉభయసభలూ సమావేశమైన కొద్దిసేపటికే వాయిదా పడ్డాయి. కావేరీ జలాల వివాదంపై నిరసనలు హోరెత్తడంతో రాజ్యసభ శుక్రవారానికి వాయిదా పడింది. కాగా, లోక్‌సభలో రాఫేల్‌ వొప్పందంపై విపక్షాలు నినాదాలతో ప్రభుత్వంపై విరుచుకుపడటంతో గందరగోళం నెలకొంది. ట్రిపుల్‌ తలాక్‌ తాజా బిల్లుపై చర్చ జరగాల్సిఉండగా సభ రాఫేల్‌ వొప్పందంపై దద్దరిల్లింది. విపక్ష సభ్యుల ఆందోళనల నడుమ సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్టు స్పీకర్‌ ప్రకటించారు. ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుపై చర్చ నేపథ్యంలో బీజేపీ, కాంగ్రెస్‌లు తమ పార్టీ సభ్యులు విధిగా సభకు హాజరు కావాలని విప్‌ జారీ చేశాయి.

ఈ బిల్లుపై చర్చలో పాల్గొనేందుకు కాంగ్రెస్‌ అంగీకరించింది. ట్రిపుల్‌ తలాక్‌ను నేరపూరిత చర్యగా బిల్లులో పేర్కొనడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ కాం‍గ్రెస్‌ నేత శశి థరూర్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టనున్నారు. ఇక ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ బిల్లు, కంపెనీల చట్టం సవరణ బిల్లులను కూడా ప్రభుత్వం లోక్‌సభ ముందుంచనుంది.