బోగీబీల్‌ వంతెనను ప్రారంభించిన మోదీ.!

SMTV Desk 2018-12-25 15:48:07  Bogibel, Road cum rail bridge, assam, Narendra Modi

గువహటి, డిసెంబర్ 25: రెండు దశాబ్దాల క్రితం శంకుస్థాపన చేసిన దేశంలోనే అతి పెద్ద రోడ్డు, రైల్వే వంతెన సుమారు 21 సంవత్సరాల తరువాత ప్రారంభం అయ్యింది. అదే బోగీబీల్‌ వంతెన. ఈ వంతెన నిర్మాణానికి 1997లొ అప్పటి ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవేగౌడ శంకుస్థాపన చేశారు. కాగా 2002లో మాజీ ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈరోజు అటల్‌ బిహారీ వాజ్‌పేయీ జయంతి సందర్భంగా ఈ వంతెనను ప్రధాని నరేంద్రమోడీ ప్రారంభించారు. అనంతరం జాతికి అంకితం చేసారు.

4.94 కిలోమీటర్ల పొడవుతో దేశంలోనే అతి పొడవైన రైల్‌ కమ్‌ రోడ్‌ బ్రిడ్జిగా బోగిబెల్‌ నిలవనుంది. బ్రహ్మపుత్ర నది మీద అస్సాంలోని దిబ్రూఘర్‌, ధేమాజీ జిల్లాల నుంచి అరుణాచల్‌ ప్రదేశ్‌ వరకూ ఈ బ్రిడ్జిని నిర్మించారు. దీని వల్ల 170 కిలోమీటర్ల దూరంతో పాటు, 4 గంటల ప్రయాణ సమయం కూడా తగ్గనుంది. చైనా సరిహద్దు సమీపం వరకూ నిర్మించిన ఈ బ్రిడ్జి భారత రక్షణ శాఖకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది. యుద్ధ ట్యాంక్‌ల కదలికలను, ఫైటర్‌ జెట్ల ల్యాండింగ్‌లను తట్టుకునేవిధంగా చాలా బలంగా బోగిబెల్‌ బ్రిడ్జిని నిర్మించారు.

తొలుత ఈ వంతెనని రూ.3,200 కోట్ల బడ్జెట్‌తో 4.31 కిలోమీటర్ల పొడవున నిర్మించాలని భావించారు. కానీ తరువాత దీన్ని 4.9 కిలోమీటర్ల దూరానికి పెంచారు. ఫలితంగా బడ్జెట్‌ రూ.5,900 కోట్లకు చేరింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే 0.59 కిలోమీటర్ల పొడవు పెరిగినందువల్ల రూ.2,700 కోట్ల బడ్జెట్ పెరిగింది .