పొగమంచులో వాహనాలు ఢీకొని ఏడుగురు మృతి.!

SMTV Desk 2018-12-24 18:47:06  Hariyana, Winter Accident

హరియాణ, డిసెంబర్ 24: ఉత్తరాది రాష్ట్రాలను పొగమంచు కమ్మేసింది. పొగమంచు కారణంగా హరియాణాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోహ్‌తక్‌-రేవాడి హైవేపై వెళ్తున్న దాదాపు 50 వాహనాలు వొకదానిని మరొకటి ఢీకొన్నాయి. ఈ దుర్ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోగా, కొంత మంది వాహనదారులు గాయపడ్డారు. సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది.

దట్టంగా అలుముకున్న పొగమంచు కారణంగా రహదారిపై ఎదురుగా వెళ్తున్న వాహనాలను వాహనదారులు గుర్తించలేకపోయారు. దీంతో 50 వాహనాలు వొకదానితో వొకటి ఢీకొన్నాయి. వీటిలో కార్లు, స్కూల్‌ బస్సు, ట్రక్కులు ఉన్నాయి. సమాచారం అందుకున్న పోలీస్ అధికారులు వెంటనే సంఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. క్రేన్ల సాయంతో వాహనాలను తొలగించేందుకు యత్నిస్తున్నారు. ఈ ఘటనలో ఏడుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరికొందరు గాయపడగా వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లు అధికారులు తెలిపారు.

హరియాణాతో పాటు దిల్లీ, పంజాబ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌లలోని చాలా ప్రాంతాల్లో పొగమంచు అలుముకుంది. కనీసం 500 మీటర్ల దూరంలో ఉన్న వాహనాలు కూడా కన్పించనతంగా మంచు కప్పేయడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.